Bhatti Vikramarka : జాతీయ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్ ప్రారంభించిన భట్టి విక్రమార్క
ప్రజల భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలు, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా చేస్తున్న కృషితో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.
దిశ, ఖైరతాబాద్: ప్రజల భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలు, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా చేస్తున్న కృషితో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్ 2024కు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సదస్సులో నగర సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌తో పాటు సామాజిక, వ్యాపారవేత్తలు సహా వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యక్తిగత భద్రత తో పాటు నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండేలా ప్రజలు, సెక్యూరిటీ సంస్థలను భాగస్వామ్యం చేయడమే ప్రధాన లక్ష్యంగా సదస్సులో చర్చలు జరిగాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం అనివార్యమైన ఈ డిజిటల్ యుగంలో వ్యక్తిగత భద్రత విషయంలో మార్పు కోసం జరుగుతున్న ఈ చర్చలు ప్రయోజనాన్ని అందిస్తాయని భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు.