Illegal constructions : అనుమతులు ఉండవు.. అయినా నిర్మాణాలు ఆగవు..

ఓ పక్కన జూబ్లీహిల్స్ లాంటి పాష్ ఏరియా.. మరోపక్క ఐటీ కారిడార్.. దగ్గరలోనే పేరున్న కంపెనీలు.. గత కొన్నాళ్లుగా బాగా అభివృద్ధి చెందిన ఏరియా.. అదీ సిటీకి మధ్యలో నివాసస్థలం బహిరంగ మార్కెట్‌ ధరలో సగంకన్నా తక్కువ ధరకే ప్లాట్ వస్తుంది అంటే ఎవరు మాత్రం కొనకుండా ఉంటారు. డబ్బున్న వాళ్లు అయితే ఏరియాకు ఓ ప్లాట్ కొంటారు.

Update: 2024-07-29 11:30 GMT

దిశ, శేరిలింగంపల్లి : ఓ పక్కన జూబ్లీహిల్స్ లాంటి పాష్ ఏరియా.. మరోపక్క ఐటీ కారిడార్.. దగ్గరలోనే పేరున్న కంపెనీలు.. గత కొన్నాళ్లుగా బాగా అభివృద్ధి చెందిన ఏరియా.. అదీ సిటీకి మధ్యలో నివాసస్థలం బహిరంగ మార్కెట్‌ ధరలో సగంకన్నా తక్కువ ధరకే ప్లాట్ వస్తుంది అంటే ఎవరు మాత్రం కొనకుండా ఉంటారు. డబ్బున్న వాళ్లు అయితే ఏరియాకు ఓ ప్లాట్ కొంటారు. సామాన్యులు కూడా చదరపు అడుగు కేవలం రూ.4 వేల నుంచి రూ.6 వేలు మాత్రమే చెల్లిస్తే సొంతమవుతుందనే ఆశతో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఎగబడి మరీ ప్లాట్స్ కొంటున్నారు. అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో తక్కువ ధరకే చక్కని ఫ్లాట్‌ ఇస్తామని చెబితే సొంతింటి కల నెరవేర్చుకోవాలనే ఆశతో చాలామంది అయ్యప్ప సొసైటీలో ప్లాట్స్ కొనేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే అదునుగా భావించిన డెవలపర్లు మాత్రం జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండానే మూడు - నాలుగు నెలల్లో బహుళ అంతస్తుల్లో నిర్మాణాలు పూర్తిచేసి.. ఫ్లాట్లన్నీ చకచకా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు.

జీహెచ్ఎంసీ అధికారుల సహాయ సహకారాలు..!

ఐటీ కారిడార్‌లోని గురుకుల్‌ ట్రస్ట్ పరిధిలోని అయ్యప్ప, సర్వే ఆఫ్‌ ఇండియా, భాగ్యనగర్‌ సొసైటీలు ఉన్నాయి. ఈ మూడు సొసైటీల్లో రెండొందలకు పైగానే బహుళ అంతస్తుల భవనాలను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించారు. మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. గతంలోనే కొన్ని నిర్మాణాలు పూర్తి అవగా.. ఇంకొన్ని మూడు, నాలుగు నెలల క్రితం పనులు మొదలు పెట్టినవే. అధికార పార్టీకి చెందిన కొందరి దగ్గరి బంధువులు, వారి అనుచరులు అన్నీతామై ఈ అక్రమ నిర్మాణాల తతంగాన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వారికి జీహెచ్‌ఎంసీ అధికారులు పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు ఈ విషయంతో సంబంధం ఉందని, అందువల్లే అధికారులు పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది.

స్థలం ఎంతున్నా సెల్లార్ తవ్వాల్సిందే..

బల్దియా అనుమతులివ్వకపోయినా ఇప్పటి వరకు గురుకుల్‌ ట్రస్ట్‌ కు చెందిన దాదాపు 80 శాతానికి పైగా భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీని పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2015 - 16 లో నిర్మాణంలో ఉన్న పలు భవనాలను కూల్చివేశారు. దీంతో కొన్నాళ్ల పాటు అనుమతి లేని నిర్మాణాలు కొంత తగ్గాయి. కొన్నాళ్ల క్రితం తిరిగి నిర్మాణాలు మొదలు పెట్టారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక్కసారిగా నిర్మాణాలు ఊపందుకున్నాయి. నెలల వ్యవధిలోనే ఐదు నుంచి ఏడంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. కళ్ల ముందే బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా జీహెచ్‌ఎంసీ పట్టించుకోవడం లేదని, ఫిర్యాదు చేసినా.. అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. 300 నుంచి 600, 700 గజాల విసీర్ణంలోని స్థలాల్లో ఏడెనిమిది అంతస్తులు నిర్మిస్తున్నారు. వీటిలో దాదాపు అన్ని భవనాల్లో సెల్లార్లూ తవ్వుతున్నారు. పట్టణ ప్రణాళికా నిబంధనల ప్రకారం సెల్లార్‌ తవ్వాలంటే కనీసం 1000 గజాల స్థలం ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం 300 గజాల స్థలంలోనూ సెల్లార్లు తవ్వుతున్నారు. సెట్‌ బ్యాక్‌లు, అగ్నిమాపక ఏర్పాట్లు వంటి కనీస నిబంధనలూ మచ్చుకైనా కనిపించడం లేదు. ప్లాట్‌ మొత్తం సెల్లార్ల కోసం తవ్వుతుండటంతో పక్కనున్న భవనాల నిర్మాణ స్థిరత్వం పై ప్రభావం పడే ప్రమాదముంది.

అన్ని శాఖల మేనేజ్..

గురుకుల్‌ ట్రస్ట్‌ భూముల్లోని భవన నిర్మాణాల్లో కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. స్థల యజమానులతో ఒప్పందం కుదుర్చుకుంటున్న డెవలపర్లు.. అటు రాజకీయ నాయకులు, ఇటు జీహెచ్‌ఎంసీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్, రిజిస్ట్రేషన్ ఇలా అన్ని డిపార్ట్‌మెంట్‌ అధికారులను మెనేజ్‌ చేసి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఉన్న కాస్త స్థలంలో డెవలపర్లు తమకు అవసరమున్నట్టు భవనం నిర్మిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, హోటళ్లు, నివాసేతర అవసరాలకు వినియోగిస్తున్నారు. జనాలు కూడా ఫ్లాట్ల విక్రయానికి సంబంధించి బహిరంగ మార్కెట్‌ తో పోలిస్తే అత్యంత తక్కువకు వస్తుందన్న ఉద్దేశంతో అయ్యప్ప సొసైటీలో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు.

వారానికో శ్లాబ్‌..

సాధారణంగా రెండంతస్తుల ఇంటిని నిర్మించాలనుకుంటే పనులు పూర్తయ్యేందుకు ఎంత లేదన్నా 4 నుండి 6 నెలల సమయం పడుతుంది. ఫౌండేషన్‌ నుంచి పిల్లర్లు, శ్లాబ్‌ లు, గోడలు ఇలా ప్రతీది నిర్ణీత రోజులపాటు క్యూరింగ్‌ అయ్యాకే తదుపరి పనులు మొదలు పెడ్తారు. కానీ అయ్యప్ప సొసైటీలో మాత్రం వారానికో శ్లాబ్‌ చొప్పున నెలన్నర, రెండు నెలల్లో ఐదారు శ్లాబ్‌ లు వేస్తున్నారు. ఆ వెంటనే చుట్టూ గోడలు నిర్మించి రంగులు వేస్తున్నారు. దీంతో కూల్చివేత ఇబ్బందులుండవన్నది నిర్మాణదారుల వ్యూహం.. భవనానికి పెయింటింగ్‌ వేసిన అనంతరం లోపల ప్లాస్టింగ్‌, ఫ్లోరింగ్‌ వంటి పనులు చేస్తున్నారు.

అంతస్తుకు రెండు నుంచి మూడు లక్షలు...

అక్రమ నిర్మాణాలకు సంబంధించి అంతస్తులను బట్టి జీహెచ్ఎంసీ అధికారుల అక్రమార్జన సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో అంతస్తుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. భవనం ఎన్ని అంతస్తులు నిర్మిస్తే అంత మొత్తం నిర్మాణదారులు సమర్పించుకోవాల్సి ఉంటుందట. ఇందులో కొందరు ప్రజాప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఇతరులకు కూడా వాటాలు వెళ్తాయని ప్రచారం జరుగుతోంది. అక్రమ కట్టడాల పై ఫిర్యాదు చేసినా జీహెచ్‌ఎంసీ యంత్రాంగం స్పందించకపోవడానికి అక్రమార్జనే కారణమని చెబుతున్నారు. టౌన్ ప్లానింగ్ లోని కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటం బిల్డర్లకు వరంగా మారుతుందనే చెప్పాలి.

Tags:    

Similar News