మాజీ ఐఏఎస్‌కు ఏపీ పోలీసుల నోటీసులు.. ఆయన పనే అంటున్న కుటుంబసభ్యులు..

Update: 2022-01-19 07:43 GMT

దిశ, శేరిలింగంపల్లి: ఓ కేసులో విచారణకు హాజరు కావాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ పి.వి రమేశ్ కుమార్‌కు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీచేశారు. బుధవారం ముగ్గురితో కూడిన విజయవాడ పోలీసుల బృందం హైదారాబాద్ కొండాపూర్‌లోని రమేష్ నివాసానికి వచ్చారు. ఓ కేసులో భాగంగా ఈనెల 22న విచారణకు రావాలని పోలీసుల నోటీసులు ఇచ్చారు. నోటీసులు తీసుకునేందుకు ఆయన అందుబాటులో లేకపోవడంతో కొండాపూర్‌లో ఉంటున్న రమేశ్ కుమార్ తల్లిదండ్రులకు వాటిని అందజేశారు. ఏపీ పోలీసులు తమను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుతం తమ వయసు 80 ఏళ్ల పైనే ఉంటుందని, అయినా పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు వాపోయారు. ఇదంతా మా అల్లుడు సీఐడీ సునీల్ కుమార్ పనే. కావాలనే మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ నేపథ్యం

మాజీ ఐఏఎస్‌ పీవీ రమేశ్​ గతంలో ఏపీ సీఎం జగన్ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీమెన్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి రూ.241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఫిర్యాదుపై రాష్ట్ర సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ అప్పటి ఎండీ, సీఈఓ గంటా సుబ్బారావు, డైరెక్టర్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కె.లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట ప్రసాద్‌తో పాటు పుణెకు చెందిన డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ముంబయికి చెందిన స్కిలర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ తదితర 26 మందిని నిందితులుగా పేర్కొంది. ఐపీసీలోని సెక్షన్‌ 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 రెడ్‌విత్‌ 120బీ సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్‌ 13(1)(సీ) (డీ) సెక్షన్ల ప్రకారం ఈ కేసు పెట్టింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ కె.అజయ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇదే కేసుకు సంబంధించి ఈనెల 22న విచారణకు హాజరు కావాలని ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.




Tags:    

Similar News