కారు దిగనున్న అంబర్ పేట్ బీఆర్ఎస్ ఇంచార్జ్ ఎడ్ల సుధాకర్ రెడ్డి ?

అంబర్ పేట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ ఎడ్ల సుధాకర్ రెడ్డి కారు దిగనున్నారు. త్వరలో ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైంది.

Update: 2023-10-18 06:51 GMT

దిశ ప్రతినిధి , హైదరాబాద్: అంబర్ పేట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ ఎడ్ల సుధాకర్ రెడ్డి కారు దిగనున్నారు. త్వరలో ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఈ మేరకు మంగళవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ఎడ్ల సుధాకర్ రెడ్డిని కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలిసింది. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌తో ఎడ్ల సుధాకర్ రెడ్డితో పొసగడం లేదు. దీంతో నియోజకవర్గంలో పార్టీ గ్రూపులుగా విడిపోయింది.

ఎడ్ల సుధాకర్ రెడ్డి మాత్రమే కాకుండా కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు, ఇతర నాయకులు ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలకు పోతున్నాడని వీధికెక్కారు. ఇలాంటి నాయకునితో కలిసి పని చేయలేమని, మరోసారి కాలేరుకు టికెట్ ఇవ్వరాదంటూ బహిరంగంగా మీడియా ముందుకు వచ్చారు. అయినా పార్టీ వారి విన్నపాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా మరోసారి కాలేరుకు టికెట్ ఖరారు చేయడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న స్థానిక నాయకులు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు.

ఇదిలా ఉండగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే, నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయాన్ని పసిగట్టిన బీఆర్ఎస్ అధిష్టానం వారి మద్య సయోద్య కుదిర్చేందుకు నగర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఇటీవల వారితో సమావేశమైన ఆయన పార్టీ కోసం కలిసి పని చేయాలని వారికి సూచించారు. అయినా వారు ససేమిరా అనడంతో అంబర్ పేట్ నాయకుల పంచాయతీ మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. అయితే ఆయనతో సమావేశం కాకముందే ఎడ్ల సుధాకర్ రెడ్డి పార్టీ మారేందుకు రంగం సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డీడీ కాలనీలోని ఎడ్ల సుధాకర్ రెడ్డి బావ ఇంట్లో ఆయనతో మంతనాలు జరిపి బీజేపీ‌లోకి రావాలంటు ఆహ్వానించడం అంబర్ పేటలో చర్చనీయాంశంగా మారగా.. ఇందకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కారెక్కిన వెంకట్ రెడ్డి..

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో అంబర్‌పేట్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీ సీనియర్ నాయకుడు, గ్రేటర్ మాజీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి దంపతులు ఇటీవల పార్టీకి బై బై చెప్పి కారెక్కిన విషయం తెలిసిందే. ఇది గ్రేటర్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వెంకట్ రెడ్డి పార్టీ మార్పుతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్పంలో భాగంగా ఎడ్ల సుధాకర్ రెడ్డిని బీజేపీలోకి మారాలని కోరినట్లు సమాచారం .

అలాంటిదేమీ లేదు.. ఎడ్ల సుధాకర్ రెడ్డి

నేను పార్టీ మారడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మా బావతో స్నేహం ఉంది. ఆయన డాక్టర్ కూడా కావడంతో తరచుగా కలుస్తుంటారు. కాగా గొంతు నొప్పితో ఉన్న కిషన్ రెడ్డి డీడీ కాలనీలో మా బావను కలిసేందుకు వచ్చారు. కిషన్ రెడ్డిని నేను కలువలేదని ఎడ్ల సుధాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News