ప్రభుత్వ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకోవాలి : సీపీఐ
శేరిలింగంపల్లి మండలంలోని ఆయా డివిజన్లలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి అర్హులైన పేదలందరికి ఇళ్ల స్థలాల కోసం వాటిని కేటాయించాలని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు.
దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండలంలోని ఆయా డివిజన్లలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి అర్హులైన పేదలందరికి ఇళ్ల స్థలాల కోసం వాటిని కేటాయించాలని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతాన్ని నిరసిస్తూ అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల కార్యదర్శి టి.రామకృష్ణ, చందూ యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని, బడా బాబులు కబ్జాలకు పాల్పడుతుంటే అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మాదాపూర్, మియాపూర్, గచ్చిబౌలి, హఫీజ్ పేట్, చందానగర్ డివిజన్లలో ప్రభుత్వ భూములను కొందరు పెద్దలు కబ్జాలకు పాల్పడుతుంటే రెవెన్యూ అధికారులు ఆవైపు కన్నెత్తి చూడడం లేదని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూం ఇళ్లను రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ఎవరికీ కేటాయించలేదని, వెంటనే అర్హులైన పేదలకు అందజేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర బడ్జెట్ లో యువత, పేదల కోసం తగిన నిధుల కేటాయింపు జరగలేదని ఇంకెక్కడ యువత పురోగతి సాగిస్తుందని ప్రశ్నించారు. ఇక కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ వాగ్ధానాలు చేయడం తప్పా ఏ ఒక్క పథకాన్ని విజయవంతంగా ప్రజలకు అందేలా చేసిన దాఖలాలు లేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నల్ల ధనాన్ని వెలికితీసి పేదల ఖాతాలో వేస్తామని ఇచ్చిన వాగ్ధానం ఏమైందన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీ పెద్దలు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని, దేశ సంపదను అంబానీ, ఆదానీలకు అప్పగిస్తున్నారని, దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్నారని దుయ్యబట్టారు. 1200 మంది అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రమని, కానీ బంగారు తెలంగాణ ఎక్కడ ఉందని, కేసీఆర్ కుటుంబమే బంగారం అయిందని విమర్శించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు పానుగంటి పర్వతాలు మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి మండలంలో అన్యాక్రాంతం అవుతున్న భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె. వెంకటస్వామి, ఖాసీం, శ్రీను, ఎం. వెంకటేశం, లింగం, టి. కృష్ణ, కె. లక్ష్మీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.