తెలుగు వర్సిటీ వీసీగా ఆచార్య వెలుదండ నిత్యానందరావు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నూతన ఉపాధ్యక్షులుగా ఆచార్య వెలుదండ నిత్యానందరావు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
దిశ, హైదరాబాద్ బ్యూరో: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నూతన ఉపాధ్యక్షులుగా ఆచార్య వెలుదండ నిత్యానందరావు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లి లోని విశ్వవిద్యాలయం ఛాంబర్ లో ఆయన 12వ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆచార్య వెలుదండ నిత్యానందరావు మాట్లాడుతూ.. విశ్వ విద్యాలయానికి గతంలో గురు స్థానంలో ఉన్న ఎందరో ప్రముఖులు ఉపాధ్యక్షులుగా పని చేశారని, వారి సరసన తాను కూడా చేరడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వారు ఇచ్చిన స్ఫూర్తితో, సిబ్బంది సహకారంతో విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమానికి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఇంచార్జ్ ఉపాధ్యక్షులు ఆచార్య సూర్య ధనంజయ్, తెలుగు వర్శిటీ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య గౌరీశంకర్, ఆచార్య చెన్నకేశవరెడ్డి, డాక్టర్ జుర్రు చెన్నయ్య తదితరులు విచ్చేసి నూతన వీసీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆచార్య రెడ్డి శ్యామల, ఆచార్య బుక్యా బాబురావు, ఆచార్య కోట్ల హనుమంతరావు ,ఏఎన్ జగదీష్, డాక్టర్ రత్నశ్రీ, డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు .