రూ. 10 వేల కోట్ల భూమికి స్కెచ్ !.. ముగ్గురి అరెస్ట్..

హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన భూమిని కొట్టేసేందుకు ముగ్గురు బడా స్కెచ్ వేశారు.

Update: 2024-10-23 02:42 GMT

దిశ, సిటీ క్రైమ్/సికింద్రాబాద్ : హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన భూమిని కొట్టేసేందుకు ముగ్గురు బడా స్కెచ్ వేశారు. ఇందులో టాలీవుడ్ సిని నిర్మాతతో పాటు తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన రికార్డు అసిస్టెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నారు. నకిలీ పత్రాలు సృష్టించి కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు రూ.10 వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి పై వివాదం సృష్టించారు. కానీ ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు దాదాపు 21 ఏండ్ల పాటు సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేశారు. కబ్జాదారుల నిజస్వరూపాన్ని సుప్రీం కోర్టులో నిరూపించడంతో వారి పై చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గతంలో సీసీఎస్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, అనంతరం దర్యాప్తు చేసిన ఓయూ పోలీసులు మూడు రోజుల కిందట ముగ్గురిని అరెస్టు చేశారు.

రాయదుర్గం గ్రామంలోని సర్వే నెం.46లో..

రాయదుర్గం గ్రామంలోని సర్వే నెం. 46 లోని దాదాపు 84 ఎకరాల భూమి ఉంది. ఇది భూ రికార్డుల ప్రకారం ప్రభుత్వం భూమి. ఈ స్థలం పై టాలీవుడ్ నిర్మాత బి.శివరామక్రిష్ణ, రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగమయ్య గౌడ్ కన్ను పడింది. ఈ స్థలాన్ని ఎలాగైనా కాజేయాలనే ఆలోచనతో 2003 నుంచి ఇది తమ స్థలమని, ప్రభుత్వ స్థలం కాదని వాదించారు. దీని కోసం తెలంగాణ స్టేట్ అర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (టీఎస్ఏఆర్ఐ) రికార్డ్ అసిస్టెంట్ కొత్తని చంద్రశేఖర్ సహాయంతో తప్పుడు పత్రాలను రూపొందించి వాటి ద్వారా భూమి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిందిగా నిరూపించే ప్రయత్నం చేశారు. కింది స్థాయి కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు పిటిషన్లను వేస్తూ కోర్టులను తప్పుదోవ పట్టించారు. రెవెన్యూ అధికారులు కూడా వారికి దీటుగా అది ప్రభుత్వ భూమి అంటూ తగిన ఆధారాలతో వారికి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో తప్పుడు పత్రాలతో కోర్టులను తప్పుదారి పట్టించారని, ఆ సందర్భంలో ఉత్తర్వులను వారికి అనుకూలంగా తెచ్చుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయినా రెవెన్యూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారి పిటిషన్లకు కౌంటర్లు ఇచ్చి రూ.10 వేల కోట్ల విలువ చేసే భూమిని కాపాడుకుంటూ వచ్చారు.

అనుమతి లేని సంస్థ జారీ చేసిన పేపర్స్ పుట్టించడంతో డొంక కదిలింది..

ఈ సర్వే నెం. 46 కు సంబంధించిన శేత్వార్, పహానీలకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ జారీ చేసినట్లు పత్రాలను తయారు చేశారు. వాటిని కోర్టులో చూపించి ప్రైవేటు భూమిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ పత్రాల జారీ పై రెవెన్యూ అధికారులు తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులను సంప్రదించి ఆరా తీశారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు సర్టిఫైడ్ కాపీలు ఇచ్చే అర్హత లేదని తెలుసుకున్నారు. అదే విధంగా వారు పురాతన ఒరిజినల్ రికార్స్డ్ కు కస్టోడియన్ మాత్రమేనని, సర్టిఫైడ్ కాపీలను ఇచ్చే అధికారం లేదని స్పష్టమైంది. అదే విధంగా నకిలీ పత్రాలను సృష్టించిన భాషను పరిశీలించారు. ఈ భూమికి సంబంధించిన సేల్ డీడ్ ‘15 అబన్ 1259 హిజ్రీ 1887’లో అయినట్లు తయారు చేశారు. అయితే ఆ సంవత్సరంలో హైదరాబాద్ స్టేట్ అధికారిక భాష పర్షియన్ గా టీఎస్ఏఆర్ఐ నిర్ధారించింది. వీరు ఆ సేల్ డీడ్ ను ఉర్దూ భాషలో ఉన్నట్లు రూపొందించారు. అదే విధంగా 15 అబన్ అని రాశారు.

అబన్ అంటే మాసం. పర్షియన్ కాలంలో హిజ్రీ లేదని, ఫాస్లీ క్యాలెండర్ చలామణిలో ఉండేదని, దాంట్లో అబన్ అంటే 12 వ నెల అని టీఎస్ఏఆర్ఐ నిర్ధారించి, సేల్ డీడ్ మీద ఉన్న తేదీ, సంవత్సరం తప్పుని గుర్తించింది. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించిన రెవెన్యూ అధికారులు వీటిని సుప్రీం కోర్టు ముందు పెట్డడంతో కబ్జాదారుల ఫోర్జరీ పత్రాల బాగోతం బయటపడింది. ఈ బాగోతం పై ఆగస్టు 8న తెలంగాణ స్టేట్ అర్కైవ్స్ డైరెక్టర్ ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ ను ఓయూ పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు. కేసుదర్యాప్తు చేసిన పోలీసులు కుట్రపూరితంగా ప్రభుత్వ భూమిని కాజేసేందుకు టాలీవుడ్ నిర్మాత బి.శివరామక్రిష్ణ, రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగమయ్య గౌడ్ లతో కలిసి తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రికార్డ్ అసిస్టెంట్ కొత్తని చంద్రశేఖర్ ఫోర్జరీ పత్రాలను తయారు చేసినట్లు నిర్ధారించి పోలీసులు మూడు రోజుల కిందట ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుండడంతో మరిన్ని అరెస్టులు ఉంటాయని పోలీసులు అంటున్నారు.


Similar News