ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం.. మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ(Muthyalamma Temple) విగ్రహం ధ్వంసం ఘటనను తీవ్రంగా పరిగణించినట్లు మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చెప్పారు.
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ(Muthyalamma Temple) విగ్రహం ధ్వంసం ఘటనను తీవ్రంగా పరిగణించినట్లు మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చెప్పారు. ఈ అంశంపై మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఘటన జరిగిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆలయ పునరుద్ధరణ పనులు కూడా చేపట్టినట్లు తెలిపారు. కొన్ని అల్లరిమూకలు మత సామరస్యానికి భంగం కలిగించాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలు కూడా మతపరమైన అంశాన్ని రాజకీయంగా చూడటం, కామెంట్లు చేయడం, విద్వేశాలు రెచ్చగొట్టడం సరికాదని అన్నారు. అన్ని విషయాల్లో రాజకీయాలు చేయడం తగదని చెప్పారు. దైవాన్ని మతాల ప్రాతిపదికన విభజించొద్దని అన్నారు. తాము ప్రజల నమ్మకాలపై రాజకీయాలు చేయదలుచుకోలేదని చెప్పారు.
ప్రజలు అప్రమత్తంగా, సంయమనంతో ఉండాలని సూచించారు. కాగా, సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. అక్టోబర్ 13న రాత్రి సమయంలో ఆలయంలో నుంచి శబ్ధం రావటంతో స్థానికులు మేల్కొని.. పారిపోతున్న ముగ్గురు దుండగుల్లో ఒకరిని పట్టుకుని దేహశుద్ధిచేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. పారిపోయిన వారికోసం గాలింపు చేపట్టారు. అయితే.. ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించగా.. ఓ దుండగుడు అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్నుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టుగా ఉంది. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో.. హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.