HYD : ట్యూషన్‌కి వెళ్ళిన బాలుడు మిస్సింగ్ కలకలం..
ట్యూషన్‌కు వెళ్లిన 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు ఇంటికి తిరిగి రాని ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దిశ, మీర్ పేట్: ట్యూషన్‌కు వెళ్లిన 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు ఇంటికి తిరిగి రాని ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసరి నారాయణరావు కాలనీలో నివాసముంటున్న మధుసూదన్ రెడ్డి, కవితలకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు మహీధర్ రెడ్డి (లిట్టు) మీర్ పేట్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 8 వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే ఆదివారం సాయంత్రం సుమారు 3:45 గంటల తన సోదరునితో కలిసి ట్యూషన్‌కు వెళుతున్నానని చెప్పి బయలు దేరి వెళ్ళాడు. తన సోదరుడు ముందే ట్యూషన్‌కు వెళ్లిపోగా అదృశ్యమైన బాలుడు ట్యూషన్‌కు రాలేదని టూషన్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో బంధువుల ఇళ్లల్లో వెతికిన ఎలాంటి ఆచూకీ లభించకపోవడం తో కుటుంబ సభ్యులు మీర్ పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించగా బాలుడు గుర్తు తెలియని టూ వీలర్ వాహనంపై వెళుతున్నట్లు సీసీ కెమెరాలలో దృశ్యాలు నమోదయ్యాయి. ట్యూషన్ కి వెళ్ళిన బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాలుడు అదృశ్యమయ్యాడా లేక కిడ్నాప్‌నకు గురయ్యాడా అనే కోణంలో 4 టీంలుగా ఏర్పడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.