HYD: సికింద్రాబాద్ స్వప్నలోక్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 10 మంది!
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాంప్లెక్స్‌లోని 7, 8 అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దిశ, బేగంపేట: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాంప్లెక్స్‌లోని 7, 8 అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగుతూ ఉండడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని చీకటిమయం చేశాయి. దట్టమైన పొగలు బయటికి వస్తూ ఉండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన నాలుగు ఫైర్ ఇంజిన్లు ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.
అయితే.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటల్లో సుమారు 8 నుంచి పది మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. తమను కాపాడాలంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. కాంప్లెక్స్‌లో పలు ఆఫీసులు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. కాగా.. 7, 8 అంతస్తుల్లో బట్టల దుకాణాలు, గోదాం ఉన్నట్టు తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి.. అసలు లోపల ఎంత మంది ఉన్నారు. వాళ్లను ఎలా రక్షించాలన్న ప్రయత్నాలు మొదలుపెట్టారు. భారీగా ఎగిసి పడుతున్న మంటలతో.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో.. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. మంత్రి తలసాని గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి, ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.