కుక్కల హల్‌చల్.. గంట వ్యవధిలో నలుగురిపై దాడి
జనగామ పట్టణంలో కుక్కల హల్చల్ పెరిగింది.
దిశ, జనగామ: జనగామ పట్టణంలో కుక్కల హల్చల్ పెరిగింది. గురువారం ఉదయం ఒక్కరోజే ఏకంగా నలుగురిపై ఓ పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. టీచర్స్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుక్క కాటు గురైన వారిలో ఓ ఆరేళ్ల చిన్నారి, ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఇద్దరు స్థానికులు ఉన్నారు. పిచ్చికుక్క వీధుల్లో తిరుగుతూ కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేస్తుండడంతో స్థానికులు కర్రలతో వెంటపడి దాన్ని చంపేశారు.
ఈ సంఘటనను స్థానికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పట్టణంలో కుక్కల బెడదను నివారించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్థానిక కౌన్సిలర్ వాంకుడు అనిత జనగామ మున్సిపల్ కమిషనర్ రజితకు ఫోన్లో సమాచారం అందించి పిచ్చి కుక్కలు లేకుండా చూడాలని సూచించారు. ఇలాంటి వాటిపై నిర్లక్ష్యం చేస్తే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పిచ్చికుక్కల సమాచారాన్ని ఇవ్వాలని కూడా ఆమె స్థానికులను కోరారు.
ఏరియా ఆస్పత్రికి బాధితుల పరుగు
కుక్క కాటుకు గురైన నలుగురు బాధితులు ఇంజక్షన్ల కోసం వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి పరుగులు పెట్టారు. అసలే పిచ్చికుక్కలు కావడంతో వారు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు. ఇంజక్షన్ లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్క కాటుకు గురైన వారు ఇబ్బంది పడకుండా వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రిని సంప్రదించాలని జనగామ ఏరియా ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ సుగుణాకర్ రాజు స్పష్టం చేశారు. డాక్టర్ల సూచన మేరకే ట్రీట్మెంట్ తీసుకోవాలని కూడా ఆయన సూచించారు.