రవాణా శాఖలో భారీ దందా.. అధికారుల తీరుతో అడ్డు అదుపు లేకుండా..!
రవాణాశాఖలో పర్మిట్ దందా జోరుగా సాగుతున్నది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే కొత్త ఆటోలకు అధికారులు పర్మిట్ ఇవ్వకపోవడంతో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్దిల్లుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: రవాణాశాఖలో పర్మిట్ దందా జోరుగా సాగుతున్నది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే కొత్త ఆటోలకు అధికారులు పర్మిట్ ఇవ్వకపోవడంతో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్దిల్లుతున్నది. షోరూంల డీలర్లు, ఫైనాన్స్ కంపెనీలకు చెందిన వారు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఈ దందాను ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం సాగుతున్నది. దీనికి రవాణాశాఖ ఆఫీసర్లు సహకరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఈ దందా జోరుగా సాగుతుందని పలువురు పేర్కొంటున్నారు.
గ్రేటర్‌లో రెండున్నర లక్షల ఆటోలు
పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఆటోల వినియోగం ఎక్కువగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఆటోలు ఉండగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రెండున్నర లక్షల ఆటోలు నడుస్తున్నాయి. వాటితో పొల్యూషన్ ఎక్కువగా వస్తుందని భావించిన సర్కారు తాజాగా పెట్రోల్, డీజిల్‌తో నడిచే కొత్త ఆటోలు కొనుగోలు చేసిన వారికి పర్మిట్ నిబంధన విధించింది. ప్రస్తుతం గ్రేటర్‌లోని సికింద్రాబాద్, ఖైరతాబాద్, మెహదీపట్నం, బండ్లగూడ, మలక్‌పేట ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో నో పర్మిట్ నిబంధన సాగుతుంది.
షోరూండీలర్లు, ఫైనాన్స్ కంపెనీలు మధ్యవర్తులుగా..
గ్రేటర్‌లో కొత్తగా ఆటోలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారికి ‘పర్మిట్’ నిబంధన ఉండటంతో అనేక మంది.. డీలర్లను, ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. డీజిల్, పెట్రోల్ ఆటోలు కొనుగోలు చేస్తే రూ.6 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. ఇందులో రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు పర్మిట్‌కే వెచ్చించాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. నో పర్మిట్ నిబంధన ఎత్తేస్తే జీవనోపాధి కోసం ఆటోలు కొనుగోలు చేసే వారికి చేయూత ఇచ్చినట్టు అవుతుందని పలువురు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
సహకరిస్తున్న రవాణాశాఖ ఆఫీసర్లు?
పర్మిట్ దందాకు రవాణాశాఖ అధికారులు సైతం సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆటోలను స్క్రాప్ చేయకుండానే చేసినట్లు సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ప్రచారం ఉన్నది. ఇలా సర్టిఫికెట్ ఇస్తే ఒక్కో ఆటోకు రూ.50 వేలకు పైగానే తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒక్క ఆటో రిజిస్ట్రేషన్ చేయాలంటే స్ర్కాప్ చేసిన స్థానంలో కొత్త ఆటో రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధన ఉంది. కొత్త ఆటో కొనుగోలు చేసేందుకు ఆసక్తి లేని డ్రైవర్లు, యజమానులు స్క్రాప్ చేయకుండానే చేసినట్లు సర్టిఫికెట్లు పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. వీటిని షోరూం డీలర్లు, ఫైనాన్స్ ఏజెంట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ దందాకు శ్రీకారం చుట్టారనే ప్రచారం జరుగుతుంది. రవాణాశాఖలో పర్మిట్ దందా జోరుగా సాగుతుందని ఆరోపణలు వస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎలక్ట్రిక్ ఆటోలకు లేని నిబంధన
రోజు రోజుకూ పెరిగి పోతున్న పొల్యూషన్‌ను తగ్గించే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుంది. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించాలని భావిస్తుంది. పెట్రోల్, డీజిల్ ఆటోలు కొనుగోలు చేస్తే రూ.6 లక్షలు అవుతుండగా, ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాలు కొనుగోలు చేస్తే రూ.3.5 లక్షలే ఖర్చవుతున్నది. అయితే పర్మిట్ నిబంధన ఎలక్ట్రిక్ ఆటోలకు పెట్టని ప్రభుత్వం దీనిపై డ్రైవర్లకు అవగాహన కల్పించాలని భావిస్తుంది. అంతే కాకుండా ప్రోత్సాహకాలూ ఇచ్చేందుకు సిద్ధమవుతూ.. జీరో పొల్యూషన్ చేసే దిశగా అడుగులు వేయాలని ప్రణాళిక రచిస్తున్నది.
‘పర్మిట్’ నిబంధన ఎత్తేయాలి - వేముల మారయ్య, తెలంగాణ ఆటోమోటర్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు.
కుటుంబ పోషణ కోసం ఆటోలపై లక్షలాది మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా ఆటోలు కొనుగోలు చేసే వారికి పర్మిట్ నిబంధన పెట్టింది. ఇది వారికి గుదిబండగా మారింది. పర్మిట్ కోసం అదనంగా రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. వెంటనే ఈ నిబంధన ఎత్తేయాలి. ఆటో కార్మికుల సమస్యలపై నవంబర్ 5న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నాం.