టీజీఎస్పీడీసీఎల్ లో 2263 మందికి పదోన్నతులు

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చరిత్రలోనే తొలిసారిగా ఒకే రోజు 2263 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించింది.

Update: 2024-08-18 16:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చరిత్రలోనే తొలిసారిగా ఒకే రోజు 2263 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించింది. అందుకు సంబంధించిన సర్క్యూలర్ ను ఆదివారం సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ జారీ చేశారు. ఇంజినీరింగ్ సర్వీస్ లో 101 మంది, అకౌంట్స్ సర్వీస్ లో 47 మంది, ఓఅండ్ఎం సర్వీస్ లో 2099, పీఅండ్ జీ సర్వీస్ లో 16 మంది అధికారులు, సిబ్బందికి పదోన్నతులు లభించాయి. ఈ నెల 8న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పలువురు అధికారులు 2017 నుండి పెండింగ్ లో వున్న పదోన్నతుల గురించి వివరించారు. ఎన్నో ఏళ్లుగా పదోన్నతులకు నోచుకోని ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతింటున్నదని వెంటనే కార్యచరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పదోన్నతులతో ఏర్పడిన ఖాళీ పోస్టులను సైతం త్వరలోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎండీ తెలిపారు. పదోన్నతులు కల్పించినందుకు ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు. 


Similar News