దిశ, వెబ్డెస్క్: వేములవాడకు రాష్ట్ర ప్రభుత్వం వరాల వర్షం కురిపించింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించింది. అందులో ముఖ్యంగా స్థానిక రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనుంది. ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న రోడ్లును వెడల్పు చేసేందు రూ.47.85 కోట్లు మంజూరు చేసిన సర్కార్.. ఈ నిధులతో రోడ్డు విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను చేపట్టనుంది.
మూలవాగులో ఉన్న బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు పైప్లైన్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.3.8 కోట్లు కేటాయించి పనులకు ఆమోదం తెలిపింది. ఇక ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.26 కోట్లతో ఎస్పీ భవనం నిర్మాణం, రూ.45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, రూ.4 కోట్ల 80 లక్షలతో వర్కింగ్ ఉమెన్ హస్టల్ నిర్మాణాలు పూర్తయ్యాయి. అంతేకాకుండా వేములవాడకు చెందిన 17 కుటుంబాలకు చెందిన వ్యక్తులు గల్ఫ్ దేశాలలో మరణించగా.. ఒక్కో కుటుంబానికి రూ.85 లక్షల పరిహారం ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా 631 శివశక్తి మహిళ సంఘాలకు రూ.102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణి చేయనున్నట్లు తెలుస్తోంది.