Hot News: కమలనాథులు ఎక్కడ..? వరద బాధితులకు పరామర్శలేమాయే!

వర్షాలు, వరదలతో మూడు ఉమ్మడి జిల్లాల్లోని పలు ప్రాంతాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయితే బీజేపీ నేతలు కనిపించకపోవడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.

Update: 2024-09-04 02:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వర్షాలు, వరదలతో మూడు ఉమ్మడి జిల్లాల్లోని పలు ప్రాంతాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయితే బీజేపీ నేతలు కనిపించకపోవడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఎనిమిది మంది ఎంపీలను గెలిపించింది ఇందుకోసమేనా అంటూ సోషల్ మీడియాతో పాటు బాధిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ పార్టీకి చెందిన ఒక్క ఎంపీ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం విమర్శలకు దారితీసింది. ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ప్రయోజనం లేకుండా పోయిందనే మాటలూ వినిపిస్తున్నాయి. పార్టీ నాయకత్వం నుంచి ఆదేశాలు రాలేదా? వారి మధ్య సమన్వయం కొరవడిందా? ఏపీకీ బోట్లు హెలికాప్టర్లను పంపి తెలంగాణను విస్మరించిందా? ఇలాంటి గుసగుసలు మొదలయ్యాయి. చివరకు లోకల్ పార్టీ లీడర్లు, కేడర్ సైతం ఫీల్డులో కనిపించకపోవడాన్ని ప్రజలు ప్రస్తావిస్తున్నారు.

పిలుపునిచ్చినా..

బాధితులకు సాయం చేయడానికి తరలివెళ్లాలంటూ శ్రేణులకు పిలుపునిచ్చినా.. దాని ప్రభావం కనిపించలేదు. కేడర్ పెద్దగా పట్టించుకోలేదు. మాజీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయినవారు, ఎంపీ అభ్యర్థులు.. వీరెవ్వరూ బాధితులను ఆదుకోవడానికి ఎలాంటి రూపంలోనూ ముందుకు రాకపోవడం ఆ పార్టీని కార్నర్ చేసినట్లయింది. లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించిన ఎనిమిది మంది ఎంపీలు సీరియస్‌గా లేరని, కనీసం అధిక వర్షాలు పడిన ప్రాంతాల్లోనైనా వారు కనిపించకపోవడాన్ని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.

ఆలస్యంగానైనా ఫీల్డులో బీఆర్ఎస్

సీఎం రేవంత్ సహా మంత్రులంతా క్షేత్రస్థాయిలో తిరుగుతూ బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ ప్రభుత్వం తరఫున చేయనున్న సాయం గురించి భరోసా ఇస్తున్నారు. అధికారులు సైతం వారి ఆదేశాలను అమలు చేస్తున్నారు. ఆలస్యంగానైనా బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ నేతలు బాధిత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, దుస్తులు, ఇంట్లో వాడుకునే పరికరాలు తదితరాలను అందజేస్తున్నారు. రెండు మూడు రోజుల పాటు ప్రకటనలకు పరిమితమైనా ప్రజల నాడిని పసిగట్టి ఫీల్డులోకి దిగారు. కానీ బీజేపీ నేతలు కనిపించకపోవడంతో ఇప్పుడు ఆ రెండు పార్టీలు చేసే విమర్శలను ఎదుర్కోవాల్సిన డిఫెన్సులో పడింది. హైడ్రా విషయంలో తలో మాట మాట్లాడడంతో పలచనైన ఆ పార్టీ నేతలు ఇప్పుడు వరదల విషయంలో పట్టీ పట్టనట్లుగా వ్యవహరించడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. ఆ పార్టీ నేతల మధ్యనే సయోధ్య కరువైందా? కోల్డ్ వార్ నడుస్తున్నదా? ఆధిపత్య పోరు మొదలైందా? సమన్వయం చేయడంలో లీడర్‌షిప్ విఫలమైందా? ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కేంద్రం నుంచి అందే సాయమెంత?

మూడు రోజుల వర్షాలు, వరదలతో రాష్ట్రానికి జరిగిన నష్టానికి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ రూపంలో సాయం చేస్తుంది? ఎన్ని నిధులు విడుదల చేస్తుంది? బాధితులను ఏ రకంగా ఆదుకుంటుంది? వీటిపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికే కేంద్రం నుంచి రూ. 5,438 కోట్ల మేర సాయాన్ని ఇవ్వాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. బాధిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని స్వయంగా అంచనా వేయాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం ప్రధాని కార్యాలయానికి, కేంద్ర హోంశాఖకు లేఖలు రాశారు. ఇలాంటి సమయంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు సహా ఎనిమిది మంది ఎంపీలు ఎలాంటి చొరవ తీసుకుంటారన్నదానిపై ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ సైతం బీజేపీని విమర్శించడం ద్వారా ఆ పార్టీతో స్నేహ సంబంధాల్లో లేమంటూ ప్రజల్లోని అనుమానాలకు చెక్ పెట్టాలనుకుంటున్నది.


Similar News