Hot News: నేనూ కాంగ్రెస్‌లోకి వస్తా..! మరో ముగ్గురు ఎమ్మెల్యేలను వెంట తీసుకొస్తా

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.

Update: 2024-09-12 02:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకోసం ఢిల్లీ పెద్దలకు దగ్గరగా ఉండే ఏపీకి చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ లీడర్ ద్వారా లాబియింగ్ చేస్తున్నట్టు సమాచారం. ‘ఏమైనా చేయండి. నన్ను మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించండి. ఎమ్మెల్సీ పదవికి కూడా రిజైన్ చేస్తా. అంతే కాదు.. నాతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ లోకి తీసుకొస్తా’ అని ప్రతిపాదన పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే సదరు ఎమ్మెల్సీ ప్రపోజల్ విషయంపై సీఎం రేవంత్ ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.

అరెస్ట్ భయం

బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ లో గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ట్యాపింగ్ కోసం కావాల్సిన పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు సదరు ఎమ్మెల్సీ పెద్ద ఎత్తున ఫండింగ్ చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే అంత పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చిన గులాబీ లీడర్ ట్యాపింగ్ ను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ఆర్థికంగా ప్రయోజనం పొందినట్టు విమర్శలు వచ్చాయి. ఈ విషయాలన్నీ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులను విచారిస్తున్న సమయంలో బయటకు వచ్చినట్టు తెలుస్తున్నది. దీంతో సదరు ఎమ్మెల్సీని సమయం, సందర్భం చూసుకుని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే అరెస్టుకు భయపడిన ఆ గులాబీ లీడర్ కేసు నుంచి తప్పించుకునేందుకు ఏఐసీసీకి సన్నిహితంగా ఉండే ఏపీకి చెందిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది.

ఎమ్మెల్సీకి రిజైన్.. ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకొస్తా..

ఆరోపణలు ఎదుర్కొంటున్న గులాబీ ఎమ్మెల్సీ పదవీ కాలం మరో ఐదేళ్ల పాటు ఉంది. మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడనే పేరు ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రగతిభవన్ లోపలికి ఎప్పుడైనా వెళ్లే పరపతి ఉండేది. అంతటి క్రెడిట్ ఉన్న లీడర్ తనను ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేయకుండా చూస్తే, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, తనతోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్పిస్తానని ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనను ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఢిల్లీ పెద్దల వద్ద పెట్టగా, వారు సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు పంపినట్లు తెలిసింది. అయితే, ఇంత వరకు రేవంత్ మాత్రం ఆ ప్రపోజల్‌పై స్పందించ లేదని సమాచారం.

పార్టీకి దూరంగా ఆ ఎమ్మెల్సీ

ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినప్పట్నించి ఆ గులాబీ ఎమ్మెల్సీ పార్టీ కార్యక్రమాలకు, పార్టీకి దూరంగా ఉంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఫామ్ హౌజ్‌లో కేసీఆర్‌ను పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా కలిసినా.. సదరు ఎమ్మెల్సీ ఎక్కడ కూడా కనిపించ లేదు. అయితే, ఈ మధ్య గులాబీ లీడర్ల ఫోన్లకు రెస్పాండ్ కావట్లేదని, ఎవరైనా చొరవ తీసుకుని ఇంటికి వెళ్లినా సారు ఇంట్లో లేరు’ అని సెక్యూరిటీ గార్డు గేటు బయట నుంచే వెనక్కి పంపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.


Similar News