లోక్‌సభ ఎన్నికల్లో ‘మాదిగ’ అస్త్రం.. కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టేలా BRS, బీజేపీ భారీ స్కెచ్..!
రాష్ట్రంలోని మూడు ఎస్సీ రిజర్వు పార్లమెంటు స్థానాల అభ్యర్థుల ఎంపికలో మూడు ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మూడు ఎస్సీ రిజర్వు పార్లమెంటు స్థానాల అభ్యర్థుల ఎంపికలో మూడు ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. కాంగ్రెస్ మూడింటినీ మాలలకే (రెండు మాల, ఒకటి బైండ్ల) కేటాయించగా బీజేపీ మాత్రం రెండింటిని మాదిగలకు, ఒకటి నేతగాని కమ్యూనిటికీ కేటాయించింది. బీఆర్ఎస్ ఒకటి మాల, మరొకటి మాదిగకు ఇచ్చి, వరంగల్ స్థానంలో అభ్యర్థిని పెండింగ్‌లో పెట్టింది. మాదిగలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదంటూ కాంగ్రెస్ లీడర్లు, కేడర్‌లో ఉన్న అసంతృప్తిని బీజేపీ రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నది. మాదిగలకు బీజేపీ సంపూర్ణంగా సహకారం అందిస్తుందని ప్రధాని మోడీ స్వయంగా ఇప్పటికే హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ను కార్నర్ చేయడానికి బీజేపీ మాదిగ అస్త్రాన్ని విస్తృతంగా ప్రయోగించాలని అనుకుంటున్నది.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌పై స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర కేబినెట్‌లో చర్చించి ఐదుగురు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయించారు. ఇదే డిమాండ్‌తో దీర్ఘకాలం కొట్లాడిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) సంతృప్తి వ్యక్తం చేసింది. మాదిగ ఓటు బ్యాంకు కన్సాలిడేట్ అయ్యి బీజేపీకి రాజకీయంగా లాభిస్తుందని ఆ పార్టీ పూర్తి నమ్మకంతో ఉన్నది. దీనికి కాంగ్రెస్ కేడర్‌లోని అసమ్మతి కూడా తోడైనట్లయింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో మాదిగ ఓటు బ్యాంకు ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది, ఓట్లలో చీలిక ఏ పార్టీకి లాభిస్తుందనే చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ఒక్క మాదిగకూ ఎంపీ టికెట్ ఇవ్వని అంశాన్ని బలంగా వాడుకుని లబ్ధి పొందడంపై బీజేపీ లోతుగా ఆలోచిస్తున్నది.
మాదిగలకు కాంగ్రెస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడాన్ని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఇటీవల విమర్శించారు. తాజాగా, మంగళవారం సైతం కాంగ్రెస్ పార్టీపైన నిప్పులు చెరిగారు. ఒకవైపు ఎస్సీ వర్గీకరణతో అడ్వాంటేజ్‌గా మారిందన్న భావనతోపాటు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మరింత విస్తృతంగా ప్రచారం చేసుకోడానికి ఆలోచిస్తున్నది. ఈ సమయంలోనే కాంగ్రెస్‌పై కృష్ణ మాదిగ చేసిన కామెంట్లతో ఆ కమ్యూనిటీ ఓటర్లలో చర్చ మొదలైందని, ఇది ఆ పార్టీకి ప్రతికూలంగా పరిణమించి బీజేపీకి లాభం చేస్తుందని కమలనాథుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మాల, మాదిగ కమ్యూనిటీలను బీఆర్ఎస్ బ్యాలెన్స్ చేస్తూ చెరొక టికెట్ ఇచ్చింది. వరంగల్ సీటును ఏ కమ్యూనిటీకి ఇచ్చినా వ్యతిరేకత లేకుండా చూసుకున్నది.
మాదిగ కమ్యూనిటీకి దగ్గర కావడానికి బీజేపీ దూరదృష్టితోనే ఆలోచించింది. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని ఇచ్చిన హామీకి తగినట్లుగానే కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా నాగర్‌కర్నూల్, సంగారెడ్డిలో జరిగిన బహిరంగసభల్లోనూ దీన్ని ప్రస్తావించారు. ఇక కృష్ణ మాదిగ చేస్తున్న కామెంట్లు మరింత అడ్వాంటేజ్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నది. కృష్ణ మాదిగను బీజేపీ ఈ అవసరాల కోసం వినియోగించుకుంటున్నదనే విమర్శలు ఎలా ఉన్నా, ఎస్సీ వర్గీకరణతో తెలంగాణలో ఎక్కువ ఓటు బ్యాంకు ఉన్న ఆ కమ్యూనిటీకి దగ్గరయ్యామనే భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది. వరంగల్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో మూడు పార్టీల అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉన్న సమయంలో ‘మాదిగ’ అంశం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరం.