పెట్టుబడుల పేరుతో భారీ లాభాల ఆశ.. రూ. 10 కోట్లకు..
మా వద్ద పెట్టుబడులు పెట్టండి.. దండిగా లాభాలు సంపాదించండి అంటూ కుచ్చుటోపి పెట్టారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మా వద్ద పెట్టుబడులు పెట్టండి.. దండిగా లాభాలు సంపాదించండి అంటూ కుచ్చుటోపి పెట్టారు. ఉభయ తెలుగు రాష్ర్టాల్లోని అయిదు వందల మందికి రూ.10 కోట్ల మేర దోచుకున్న నిందితులను సైబరాబాద్ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు అరెస్టు చేశారు. బీ.ఎన్.సతీష్ డైరెక్టర్‌గా 2015లో ఎక్స్‌సీఎస్‌పీఎల్ అనే సంస్థను ప్రారంభించాడు. దీంట్లో గురుప్రసాద్, జ్యోతితో పాటు కడపకు చెందిన జీ.రాజేంద్రప్రసాద్ రాజు (29) ఫైనాన్షియల్ అడ్వయిజర్ గా, పీ.వెంకటప్రసాద్(28) టీం లీడర్‌గా, బెంగళూరుకు చెందిన వ్యాపారి ఏ.వెంకట చలపతి పనిచేస్తున్నారు. మొదట బెంగళూరులో సంస్థను ప్రారంభించి అక్కడ కార్యకలాపాలు ప్రారంభించిన సతీష్ ఆ తరువాత కేపీహెచ్‌బీ కాలనీలో రాజేంద్రప్రసాద్ రాజు, గురుప్రసాద్, వెంకటప్రసాద్, జ్యోతిలతో కలిసి బ్రాంచ్‌ను ఏర్పాటు చేశాడు.
ఆ తరువాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎక్సీఎస్పీఎల్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. తమ వద్ద మూడు నెలలపాటు డబ్బు డిపాజిట్ చేస్తే రూపాయికి రూపాయి, సంవత్సరం పాటు డిపాజిట్ చేస్తే రూపాయికి నాలుగు రూపాయలు లాభంగా ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. ఎంత డబ్బు డిపాజిట్ చేస్తే అంత మొత్తానికి ఎక్స్కాయిన్లు ఇస్తామన్నారు. ఇలా రెండు తెలుగు రాష్ర్టాల్లో దాదాపు అయిదు వందల మందిని ఉచ్చులోకి లాగిన నిందితులు రూ.10 కోట్లకు పైగా కొల్లగొట్టారు. డిపాజిట్ గడువు ముగిసిన తరువాత డిపాజిటర్లు డబ్బు తిరిగి ఇవ్వాలని అడుగగా అపుడు ఇపుడు అంటూ కాలం గడుపుతూ వచ్చారు. వీరి మాటలు నమ్మి సంస్థలో రూ.6లక్షల 50వేలు పెట్టిన టీ.రాజేంద్రప్రసాద్ ఇటీవల తన డబ్బు తీసుకోవటానికి కేపీహెచ్‌బీ ప్రాంతంలోని మంజీరా ట్రినిటీ భవనం 11వ అంతస్తులో ఉన్న కార్యాలయానికి వెళ్లగా తాళం వేసి ఉండటం కనిపించింది.
దాంతో రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు నిందితుల్లో రాజేంద్రప్రసాద్ రాజు, వెంకట ప్రసాద్, వెంకట చలపతిలను శనివారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సతీష్, గురుప్రసాద్, జ్యోతిల కోసం గాలిస్తున్నట్టు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. రిజిస్ర్టార్ ఆఫ్ కంపెనీస్, బ్యాంకర్లతో పాటు వేర్వేరు ఏజెన్సీలను సమన్వయం చేసుకుని నిందితులకు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరిస్తున్నట్టు చెప్పారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నట్టు తెలిపారు. అరెస్టయిన నిందితులపై కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఇలాంటి సంస్థల్లో డిపాజిట్లు పెట్టే ముందు ప్రజలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని అధికారులు సూచించారు.