హోం గార్డు అంటే అంత చులకనా? : మాజీ మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి మల్కాపూర్ చెరువు అక్రమ కట్టడం కూల్చివేతలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుప్రత్రిలో చికిత్స పొందుతున్న హోం గార్డు గోపాల్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు.

Update: 2024-10-01 08:25 GMT

దిశ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి మల్కాపూర్ చెరువు అక్రమ కట్టడం కూల్చివేతలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుప్రత్రిలో చికిత్స పొందుతున్న హోం గార్డు గోపాల్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌తో కలిసి బాధితుడిని పరామర్శించిన హరీశ్ రావు అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ

ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఒక్క పోలీస్ ఉన్నతాధికారి కూడా వచ్చి హోంగార్డును పరామర్శించకపోవడాన్ని తప్పుబట్టారు. హోం గార్డులు అంటే అంత చులకనా? ఇప్పటి వరకు హోం గార్డు గోపాల్ కుటుంబం చికిత్సకి లక్ష రూపాయలు ఖర్చు చేశారని, ప్రభుత్వం అతడి వైద్య ఖర్చులు కూడా భరించకపోవడం దారుణమన్నారు. నాలుగు నెలల నుంచి హోంగార్డులకు జీతం రాక, ఇటు విధి నిర్వాహణలో గాయపడి చికిత్స కోసం వైద్య ఖర్చులు భరించలేక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీశ్ రావు తెలిపారు. గోపాల్ కు తలకు దెబ్బ తగిలి మాట పడిపోయిందని, పూర్తిగా మాటలు రావడానికి నాలుగు నెలల పాటు స్పీచ్ థెరఫీ అందించాలని డాక్టర్లు చెప్తున్నారని, ప్రమాదకరమైన డిటోనేటర్లతో పేలుళ్ళు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే గోపాల్ ప్రమాదానికి గురి అయ్యారని ఆరోపించారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని.. ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేయకుండా గోపాల్‌ని, అతని కుటుంబాన్ని ఆదుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. 


Similar News