యాదాద్రి జిల్లాలో హై టెన్షన్.. ధాన్యం బస్తాలతో పోలింగ్ కేంద్రంలో రైతుల ఆందోళన
యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండంలోని కనుముక్కల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం కురిసిన అకాల వర్షం వల్ల తడిచిన
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండంలోని కనుముక్కల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం కురిసిన అకాల వర్షం వల్ల తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలింగ్ కేంద్రం వద్దే తడిచిన ధాన్యం బస్తాలతో రైతుల ధర్నాకు దిగారు. తడిచిన ధాన్యం కొనుగోలుపై తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేస్తామని పోలింగ్ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు.
లేదంటే అప్పటి వరకు ఓటు వేయమని గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. దీంతో కనుముక్కల గ్రామంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతుల ధర్నాతో అప్రమత్తమైన పోలీసులు.. భారీగా భద్రతను పెంచారు. కాగా, ఆదివారం రాత్రి రాష్ట్రంలోని పలుచోట్ల కురిసిన అకాల వర్షం వల్ల కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసింది. ఆరు గాలం పండించిన పంట ఆకాల వర్షం వల్ల పనికి రాకుండా పోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.
ఈ క్రమంలోనే కనుముక్కల గ్రామస్థులు కూడా వర్షం వల్ల తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాకు దిగారు. తడిచిన ధాన్యానికి కూడా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని తెలంగాణ సర్కార్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాలకు ఇవాళ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవ్వగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు.