Praja Bhavan: ప్రజా భవన్ ముందు బారికేడ్లతో బందోబస్తు

ప్రజా భవన్ ముందు బారికేడ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Update: 2024-09-19 06:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ చలో ప్రజా భవన్ కు రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజా భవన్ వద్ద పోలీసులు భద్రత పెంచారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గురువారం ప్రజా భవన్ ముందు పోలీసులు బారికేడ్లతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరో వైపు చలో ప్రజా భవన్ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు కేవలం రూ.2 లక్షల లోపు రుణాలు మాత్రమే మాఫీ చేసిందని దీంతో రుణమాఫీ జరగని రైతులు ఆందోళనలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఇవాళ ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదు:కేటీఆర్

ప్రజా భవన్ ముట్టడికి పిలుపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులను పోలీసులు అరెస్టు చేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని రైతులు చలో ప్రజా భవన్ కు పిలుపునిచ్చిన పాపానికి వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నిన్న రాత్రి నుంచే రైతులు, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్భందిస్తున్నారని వారేమైనా దొంగలా, ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలన్నారు. అరెస్టు చేసిన రైతులను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎంకు రైతులంటే ఇంత భయమెందుకు? అన్నదాతలపై ఇంతటి నిర్భందమెందుకు అని ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలు పెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదని, రైతుల సంఘటిత శక్తి ముందు దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదని హెచ్చరించారు.


Similar News