అన్ని వైపులా పూర్తయిన వాదనలు.. తీర్పు రిజర్వు
నామినేటెడ్ ఎమ్మెల్సీల వ్యవహారంలో అన్ని వైపులా వాదనలు కంప్లీట్ కావడంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఎప్పుడు వెల్లడించనున్నదీ తేదీని ప్రకటించలేదు.
దిశ, తెలంగాణ బ్యూరో: నామినేటెడ్ ఎమ్మెల్సీల వ్యవహారంలో అన్ని వైపులా వాదనలు కంప్లీట్ కావడంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఎప్పుడు వెల్లడించనున్నదీ తేదీని ప్రకటించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమిర్ ఆలీ ఖాన్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసి రాజ్‌భవన్‌కు పంపడంతో గవర్నర్ ఆమోదం తెలిపారు. కానీ గత ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను అప్పటి మంత్రివర్గం ఫైనల్ చేసిన తగిన అర్హతలు లేవంటూ గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వారిద్దరూ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. కొత్త ప్రభుత్వం పంపిన ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వాదనలు వినిపించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకూ కొత్త ఎమ్మెల్సీల నియామకంపై స్టే విధించింది.
దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగినట్లుగానే ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమిర్ ఆలీ ఖాన్ తరఫు లాయర్లు, గవర్నర్ కార్యదర్శి తరఫున హాజరైన న్యాయవాది సైతం హైకోర్టులో లోతుగా వాదనలు వినిపించారు. అన్ని వైపులా వాదనలను సంపూర్ణంగా విన్న చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ డివిజన్ బెంచ్ తీర్పును వెల్లడించకుండా రిజర్వులో ఉంచింది. తీర్పు ఎలా వస్తుందనే ఉత్కంఠ నెలకొన్నది.