Telangana Dalit Bandhu Scheme 2022 :దళిత బంధు మరింత ఆలస్యం?
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు స్కీం దరఖాస్తుల స్వీకరణకు బ్రేకులు పడ్డాయి. లబ్ధిదారుల ఎంపికకు ఎమ్మెల్యేల సిఫార్సు అవసరం లేదంటూ ఇటీవల
దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు (Telangana Dalit Bandhu Scheme 2022) స్కీం దరఖాస్తుల స్వీకరణకు బ్రేకులు పడ్డాయి. లబ్ధిదారుల ఎంపికకు ఎమ్మెల్యేల సిఫార్సు అవసరం లేదంటూ ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకు అప్పగించడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజకీయ లాభాల కోసం ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, లబ్ధిదారుల ఎంపికలో పక్షపాతం చూపడంతో పాటు చేయి తడిపితేనే జాబితాలో పేర్లు ఉండేలా చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో కొందరు వరంగల్ కలెక్టరేట్ కు దళితబంధు ఇప్పించాలని దరఖాస్తు చేసుకోగా ఎమ్మెల్యే సిఫార్సు లేకుండా దరఖాస్తు స్వీకరించలేమని వారి అప్లికేషన్ ను అధికారులు తిరస్కరించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 17వ తేదీన అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఎమ్మెల్యేలు ఎవరు? అని నిలదీసింది. ప్రభుత్వ పథకాల్లో రాజకీయ జోక్యం కూడదని స్పష్టం చేసింది. దళితబంధు పథకంలో ఎమ్మెల్యేల సిఫార్సు అక్కర్లేదని అర్హత మేరకు పథకానికి ఎంపిక అనేది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ మాత్రమే నిర్ణయించాలని న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను రూపొందించే పనిలో పడింది.
గత ఆర్థిక సంవత్సరంలో తమ నియోజకవర్గాల్లో ఒక్కొక్కరు 100 మంది లబ్దిదారులకు ఎంపిక చేసే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. అయితే ఇదే అదునుగా నిజమైన అర్హులకు కాకుండా తమ మద్దతు దారులకు లేదా టీఆర్ఎస్ కార్యకర్తలకు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని దళిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. విమర్శలు వ్యక్తం అవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయంతో ముందుకు సాగింది. ఈ క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) నియోజకవర్గానికి యూనిట్లు 100 నుంచి 1,500 లకు పెంచింది. ప్రస్తుతం తొలిదశలోని 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రక్రియ కొనసాగుతుండగా హైకోర్టు ఈ తీర్పు వెలువరించడంతో ప్రభుత్వం ప్రక్రియను నిలిపివేసి అధికారులతో కూడిన కమిటీల ఏర్పాటుకు మార్గదర్శకాలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక కోసం కమిటీల కూర్పుపై మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులను కోరింది. దళిత బంధు దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి, ధృవీకరించడానికి మరియు ఆమోదించడానికి నియోజకవర్గ స్థాయిలోని కమిటీలలో రెవెన్యూ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులను చేర్చే అవకాశం ఉంది.
నిరాశలో ఆశావాహులు:
దళిత బంధు పేరుతో టీఆర్ఎస్ చాలా కాలంగా ఊరిస్తూ వస్తోంది. అధికార పార్టీ నేతల ప్రచారంతో తమకు ఈ స్కీం కింద లబ్ధిచేకూరుతుందనే ఆశతో చాలా మంది ఎదురుచూస్తున్నారు. కానీ వాసాలమర్రి, హుజూరాబాద్ లో హాడావుడి చేసినా ఆ తర్వాత ఉసూరుమనిపించారనే వార్తలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితవర్గాల్లో నిరాశ నెలకొంది. నియోజకవర్గానికి 500 నుంచి 1500 లకు యూనిట్లు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆశావాహుల సంఖ్య మరింత పెరిగింది. అయితే హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ స్కీంలో మరింత ఆలస్యం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు దళితబంధు పేరు చెబుతూ ఎస్సీ కార్పొరేషన్ లోన్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే విమర్శలు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ కింద అనేక మంది బ్యాంకుల నుంచి క్లియరెన్స్ లు తీసుకున్నారు. బ్యాంకు షూరిటీ కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకువచ్చి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. ప్రభుత్వం మాత్రం లబ్దిదారుల జాబితా సిద్ధం అయినా నిధులు కేటాయించకపోవడంతో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి మార్గం చూసుకుందామనుకుని ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అప్లై చేసుకుంటే ప్రభుత్వం చేస్తున్న ఆలస్యంతో బ్యాంకులకు షూరిటీ కింద జమ చేసిన నగదుకు వడ్డీలు కట్టలేక మరింత అప్పుల్లో కూరుకుపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి: దర్యాప్తు సంస్థల దూకుడు.. రాజకీయ నాయకుల్లో మొదలైన వణుకు..!