T BJP నేతలపై హైకమాండ్ నిఘా.. ఆ లీకులపై సీరియస్

రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో పార్టీ రాష్ట్ర కమిటీలో మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.

Update: 2023-01-06 23:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో పార్టీ రాష్ట్ర కమిటీలో మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడినే మార్చబోతున్నారని పలువురు సొంత పార్టీ నేతలే ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పలువురు ముఖ్య నేతలతో జాతీయ నాయకత్వం ఈ అంశంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే దీన్ని ఎవరు ప్రచారం చేస్తున్నారు? ఎవరు చేయిస్తున్నారు? మీడియాకు తప్పుడు సమాచారం చెబుతున్నదెవరో తెలుసుకోవాలని సొంత పార్టీ నేతలపై హైకమాండ్ నిఘా ఏర్పాటు చేసింది. దీని గురించి ఆరా తీసే బాధ్యతలు రాష్ట్ర నేతలకు అప్పగించినట్లు టాక్. అధిష్టానం ఆదేశాల మేరకు ఇప్పటికే ఆ టీమ్ రంగంలోకి దిగినట్లు వినికిడి.

తెలంగాణలో పార్టీ ఇప్పుడిప్పుడే క్రమంగా పుంజుకుంటోంది. పార్టీలో జూనియర్లు, సీనియర్లు, పాత, కొత్త అనే భేషజాలు లేకుండా పనిచేయాలని జాతీయ నాయకత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. అయినా వారిలో ఎలాంటి మార్పు రాకపోవడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇప్పుడిప్పుడే బలోపేతమవుతున్న పార్టీకి రాష్ట్ర కమిటీలో మార్పులంటూ వస్తున్న వార్తలతో కొత్త చిక్కుముడులు ఎదురవుతున్నాయి. ఈ ప్రచారంతో పార్టీ నేతలు చెల్లాచెదురయ్యే అవకాశముందని హైకమాండ్ భావిస్తోంది. ఇలాంటి సమస్య రాకూడదనే ఉద్దేశ్యంతోనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని జాతీయ నాయకత్వం డిసైడ్ అయింది. అందుకే ఇలాంటి పుకార్లు ఎందుకు వస్తున్నాయి? ఇందుకు కారకులెవరో కనుక్కోవాలని పలువురు నేతలకు ఆ బాధ్యతలు అప్పగించింది.

ఢిల్లీలో ఈనెల 16, 17 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఆలోపు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్న నేతలెవరనే విషయాన్ని తెలుసుకోవాలని హైకమాండ్ రాష్ట్ర నేతలకు టాస్క్ అప్పగించినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతలపై నిఘా పెట్టాల్సి రావడం జాతీయ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారినా పార్టీ విషయానికొస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. వ్యక్తుల సొంత ఇమేజ్ పెంచుకునేందుకు పార్టీకి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే వారికి బ్రేకులు వేయాలని హైకమాండ్ డిసైడ్ అయినట్లు దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా మారుస్తారనే ప్రచారం జరిగింది. ఈ అంశంపై కూడా ఢిల్లీలో నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో క్లారిటీ ఇచ్చే అవకాశముంది. జాతీయ అధ్యక్షుడిగా ఆయన్నే కొనసాగిస్తూ తీర్మానం చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కేంద్ర మంత్రి వర్గంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు అవకాశం కల్పిస్తే.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మరొకరిని నియమించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. పాదయాత్రలు, బహిరంగసభలతో పార్టీ లైనప్ కొనసాగుతోంది. ఉన్నపళంగా అధ్యక్షుడిని మార్చితే పార్టీ వ్యవహారాలు భారీగా దెబ్బతినే అవకాశముంది. కొత్తగా ఎవరిని నియమించినా.. పూర్తిస్థాయిలో పనిచేయడానికి కనీసం ఆరు నెలల సమయమైనా పడుతుంది. అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అందుకే ఎన్నికల ముందు బీజేపీ హైకమాండ్ అలాంటి ప్రయోగం చేయకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర కమిటీలో ఎలాంటి మార్పులు ఉండబోవని, ఇప్పుడున్న టీమ్‌తోనే వచ్చే ఎన్నికలకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. పార్టీలో మార్పులు‌‌ చేర్పులంటూ తెర వెనక ఉండి అదృశ్య శక్తులు చేస్తున్న ప్రచారం.. నిజమవుతుందా? లేక ప్రచారంలాగే మిగిలిపోనుందా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read...

డేంజర్ జోన్‌లో సగం మంది BRS మినిస్టర్లు.. టికెట్ డౌటేనా? 

Tags:    

Similar News