టీ- కాంగ్రెస్ అభ్యర్థులకు హై కమాండ్ కీలక ఆదేశం..!

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆ పార్టీ అభ్యర్థులకు స్పష్టం చేశారు. పవర్ మనదే అంటూ సందేశాలు పంపించారు.

Update: 2023-12-02 03:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆ పార్టీ అభ్యర్థులకు స్పష్టం చేశారు. పవర్ మనదే అంటూ సందేశాలు పంపించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజా తీర్పు కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నదని నొక్కి చెప్పారు. ప్రలోభాలకు లొంగొద్దని సూచించారు. అలాంటి ఆఫర్లు వస్తే వెంటనే తనకు, పార్టీ కీలక నేతలకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇక కౌంటింగ్ పూర్తి కాగానే అభ్యర్థులంతా హైదరాబాద్‌కు రావాలని సమాచారం ఇచ్చారు. ఇప్పటికే అన్ని సెగ్మెంట్ల అభ్యర్థులపై ఏఐసీసీ మానిటరింగ్ కొనసాగుతుండగా, రేవంత్ తాజాగా ఇచ్చిన ఆదేశాలతో క్యాండిడేట్స్‌పై మరింత ఫోకస్ పెరిగినట్టు స్పష్టమైంది. రిజల్ట్ వచ్చిన వెంటనే ఆయా అభ్యర్థులను పార్లమెంట్ అబ్జర్వర్లు హైదరాబాద్‌కు షిప్టు చేయనున్నారు. ఫలితాల్లో కాస్త డైలమా ఉండటంతోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతున్నది.

తెలంగాణ టు కర్ణాటక..?

కాంగ్రెస్ పార్టీ పవర్ పాలిటిక్స్ ప్లాన్‌లను అమలు చేయబోతున్నది. ఎగ్జిట్ ఫల్స్ అన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం వారి గెలుపుపై ధీమాతో ఉన్నారు. పైగా గతంతో పోల్చితే ఈ సారి పోలింగ్ శాతం సైతం తగ్గింది. ఇది తమకు అనుకూలంగా ఉంటుందనేది బీఆర్‌ఎస్ వాదన. పైగా కొన్ని సంస్థలు ‘హంగ్‌’ అంటూ చెప్పుకొచ్చాయి. దీంతో గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నది. అభ్యర్థులను తమ కనుసన్నల్లోనే ఉంచాలని పార్టీ కీలక నేతలు నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్థులను క్యాంపుల్లో ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే బెంగళూరులో ప్రత్యేక హోటళ్లను సంప్రదించినట్టు సమాచారం. గెలిచిన క్యాండిడేట్లను తెలంగాణ నుంచి కర్ణాటకకు షిప్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. ఇదే అంశంపై ఏఐసీసీ నుంచి సలహాలు తీసుకుంటున్నది. సోనియా, రాహుల్, ప్రియాంక నుంచి అప్రూవల్ రాగానే క్యాంపులపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నామని పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. పార్టీ అభ్యర్థులను స్వయంగా మానిటరింగ్ చేసేందుకు డీకే శివకుమార్ శనివారం హైదరాబాదుకు రానున్నారు. తన టీం‌తో కలిసి తాజ్ కృష్ణ హోటల్‌లో అన్ని సెగ్మెంట్ల అభ్యర్థులను పర్యవేక్షించనున్నారు.


Similar News