రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. ఎల్బీ స్టేడియం వద్ద భారీ భద్రత

కాంగ్రెస్​శాసన సభాపక్ష నేత రేవంత్​రెడ్డి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Update: 2023-12-06 23:30 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కాంగ్రెస్​శాసన సభాపక్ష నేత రేవంత్​రెడ్డి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్​అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్​ఖర్గేతోపాటు వీవీఐపీలు పలువురు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు పటిష్టమైన బందోబస్తు చేస్తున్నారు. దీని కోసం మూడు వేల మందికి పైగా బలగాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే స్టేడియం లోపల, బయట మెటల్​డిటెక్టర్లు, పోలీసు జాగిలాలతో తనిఖీలు పూర్తి చేశారు. నేడు మరోసారి తనిఖీలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్​ఆంక్షలు విధించారు. ఇక, బుధవారం ఇన్​ఛార్జ్​డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్​పోలీస్​కమిషనర్​సందీప్​శాండిల్య, సెంట్రల్​జోన్​డీసీపీ శ్రీనివాస్​తదితరులు స్టేడియాంకు వచ్చి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు సస్పెన్స్​కొనసాగినా చివరకు అందరూ ఊహించినట్టుగానే కాంగ్రెస్​అధిష్టానం శాసన సభాపక్ష నేతగా రేవంత్​రెడ్డి పేరునే ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్​రెడ్డి ఎల్బీ స్టేడియంలో రాష్ర్టానికి మూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్​కు చెందిన మహామహులు హాజరు కానున్నారు. సోనియా గాంధీ, రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్​ఖర్గే, మాణిక్​రావు ఠాక్రేతోపాటు వేర్వేరు రాష్ర్టాలకు చెందిన కాంగ్రెస్​ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర అగ్ర నేతలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. దాంతోపాటు పలువురు పార్లమెంట్​సభ్యులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనాయకులకు కూడా స్వయంగా రేవంత్​రెడ్డి ఆహ్వానం పలికారు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్​మహానగరం ఆయా పార్టీలకు చెందిన వీవీఐపీలతో కళకళలాడనుంది.

లక్షకు పైగానే..

ఇదిలా ఉండగా రేవంత్​రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ర్టం నలు మూలల నుంచి లక్ష నుంచి లక్షా యాభైవేల మంది వరకు రావచ్చని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. అంత మంది స్టేడియంలో పట్టే అవకాశం లేని నేపథ్యంలో బయట పెద్ద పెద్ద ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక, ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం మూడు వేల మందికి పైగా పోలీసులను రంగంలోకి దింపనున్నారు. కార్యక్రమం మొదలు కావటానికి రెండు గంటల ముందు నుంచి జనాన్ని స్టేడియంలోకి అనుమతించనున్నారు. స్టేడియం పూర్తిగా నిండిపోయిన తరువాత ఎవ్వరినీ లోపలికి అనుమతించేది లేదని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీళ్ల కోసం స్టేడియం చుట్టూ ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్టేడియం లోపలికి వెళ్లే ప్రతీ గేటు వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

తొక్కిసలాటలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే మెటల్​డిటెక్టర్లు, పోలీసు జాగిలాలతో స్టేడియం లోపల, బయట తనిఖీలు చేసినట్టు తెలియచేశారు. రేపు ఉదయం మరోసారి తనిఖీలు ఉంటాయన్నారు. ఇక, స్టేడియం వద్ద అయిదు అగ్నిమాపక శకటాలను సిద్ధంగా పెట్టనున్నట్టు చెప్పారు. దాంతోపాటు అయిదు అంబులెన్స్​లను కూడా స్టేడియం వద్ద పెడతామన్నారు. ప్రత్యేక వైద్య బృందాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. స్టేడియం చుట్టూ ట్రాఫిక్​ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలని సూచించారు. ఇక, జనంతో వచ్చే వాహనాలను నిజాం కాలేజీ స్టేడియంలో పార్క్​చేయించనున్నట్టు చెప్పారు. పార్కింగ్​స్థలం మొత్తం నిండిపోతే నిజాం కాలేజీ నుంచి బషీర్ బాగ్​చౌరస్తా వరకు వాహనాలను పార్క్​చేయిస్తామన్నారు.

ఎస్కార్టు వాహనాలు సిద్ధం..

రేవంత్​రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్​ప్రముఖులతోపాటు వేర్వేరు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా వీళ్లంతా ఎల్బీ స్టేడియం చేరుకోవటానికి ఎస్కార్టు వాహనాలను సిద్ధం చేసి పెట్టుకున్నారు. అగ్ర నేతలు ప్రయాణించే రహదారుల్లో పూర్తిగా లేదా పాక్షికంగా వాహనాల రాకపోకలను నిషేధిస్తామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణం చేయాలని సూచించారు.

Tags:    

Similar News