Phone tapping case: ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు కీలక నిర్ణయం
ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు కీలక నిర్ణయం

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఆయన పిటిషన్ పై విచారణను రెండు వారాల పాటు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు (TG High Court) ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు (Prabhakar Rao) ముందస్తు బెయిల్ కోసం ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎక్కడికి పారిపోలేదని చికిత్స కోసమే అమెరికా వెళ్లినట్టు ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ‘క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాను. ఈ కేసులో నిందితుడిగా చేర్చడానికి ముందే తాను అమెరికా వచ్చాను. నేను పారిపాయనని ముద్ర వేయడం సరికాదు’ అని తన పిటిషన్ లో పేర్కొన్నారు. నాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదని అందువల్ల ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ప్రభాకర్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ (Bail Petition) పై ఇవాళ విచారణ జరగాల్సి ఉండగా ఇందులో తమకు మరింత గడువు కావాలి ప్రభుత్వం కోరింది. దీంతో ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పై విచారణ రెండు వారాలపాటు వాయిదా వేసింది. కాగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును స్వదేశానికి రప్పించేందుకు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈక్రమంలో ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానంలో ఈ కేసు ఎలాంటి మలుపు తీరగబోతున్నదనేది ఉత్కంఠగా మారింది.