నాగార్జున పిటిషన్‌పై నేడు విచారణ

మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది.

Update: 2024-10-07 05:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర పరువు నష్టం కల్గించారంటూ రూ.100 కోట్ల పరువు నష్టం దావాను నాగార్జున దాఖలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో.. సమంత, నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. నాగార్జున, నాగచైతన్య పేర్లు ప్రస్తావిస్తూ అభ్యంతరకర ఆరోపణలు చేయటంతో సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర దూమారం రేగింది. ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేయకుండా ఉండేందుకు సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించేందుకు నాగార్జున, నాగచైతన్య బలవంతపెట్టారని, దీనికి సమంత నిరాకరించడం విడాకులకు దారితీసిందని కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేయటంతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ మీద కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

అయితే కొండా సురేఖ వ్యాఖ్యలపై అటు టాలీవుడ్‌లో, ఇటు రాజకీయంగానూ తీవ్ర నిరసలు రేగటంతో.. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ఓ పోస్ట్ పెట్టారు. అయితే.. అందులో కేవలం సమంతను మాత్రమే ట్యాగ్ చేశారు. కొండా సురేఖ తన కుటుంబ పరువును తీసేలా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. నాగార్జున తరఫున సీనియర్ అడ్వకేట్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. స్టేట్‌మెంట్ రికార్డులో భాగంగా నాగార్జున కోర్టుకు రావాల్సి ఉంటుంది. కాగా నాగార్జున వేసిన పరువు నష్టం దావాను తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని, తగ్గేదే లేదంటూ ఇప్పటికే కొండా సురేఖ స్పష్టం చేయడంతో ఈ వివాదం మునుముందు ఏ మలుపులు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. 


Similar News