TG High Court: స్పీకర్‌కు డెడ్‌లైన్ పెట్టలేం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ
బీఆర్ఎస్ తరఫున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినందున వారిపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాడివేడి వాదనలు జరిగాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ తరఫున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినందున వారిపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాడివేడి వాదనలు జరిగాయి. పార్టీ ఫిరాయించినందుకు డిస్‌క్వాలిఫై వేటు వేసేందుకు స్పీకర్‌కు డెడ్‌లైన్ విధించాలని బీఆర్ఎస్ తరఫున హాజరైన న్యాయవాది గండ్ర మోహన్‌రావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మూడు నెలల లోపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. గతంలో మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాంటి ఫిరాయింపులు జరిగినప్పుడు అక్కడి కోర్టులు వెలువరించిన తీర్పులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్పీకర్‌కు మణిపూర్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని ఆ కాపీని కోర్టుకు అందజేశారు.
ఎమ్మెల్యేల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ జోక్యం చేసుకుని, స్పీకర్‌కు న్యాయస్థానాలు అలాంటి ఆదేశాలు ఇవ్వడం వీలు పడదని, ఇప్పటివరకు స్పీకర్2లకు కోర్టులు అలాంటి ఆదేశాలు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. శాసన వ్యవస్థలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం కుదరదని పేర్కొన్నారు. రాజ్యాంగపరమైన వ్యవస్థలో కోర్టులు వాటి పరిధిని దాటి వ్యవహరించలేవని, నిర్ణయాలు కూడా తీసుకోలేవని అన్నారు. ప్రభుత్వం తరపున హాజరైన అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి సైతం స్పీకర్ తగిన పరిశీలన చేసి నిర్ణయం తీసుకోడానికి సమయం పడుతుందని, పిటిషనర్లు కోరినట్లుగా నిర్ణయం తీసుకునేలా కోర్టులు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేవన్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు సమీక్షించవచ్చన్నారు.
బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగర్స్ పార్టీలో చేరడంతో కేపీ వివేకానందగౌడ్, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులతో పాటు బీజేపీకి చెందిన ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను కలిపి సోమవారం విచారించిన జస్టిస్ విజయసేన్‌రెడ్డి బెంచ్ ముందు మంగళవారం కూడా విచారణ జరిగింది. కోర్టులు ఈ పిటిషన్లను విచారించి నిర్ణయం తీసుకునేంతవరకు, తీర్పును వెల్లడించేంతవరకు స్పీకర్ తగిన డెసిషన్ తీసుకోరా అని జస్టిస్ విజయసేన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. దానికి కొనసాగింపుగా మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా సమాంతర వ్యవస్థపై న్యాయస్థానాలు ఆదేశాలు ఇవ్వలేవని, జోక్యం చేసుకోలేవని ఎమ్మెల్యేల తరఫున, ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు వాదించారు.
ఇరు పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ విజయసేన్‌రెడ్డి తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. వరుసగా రెండు రోజుల పాటు జరిగిన విచారణ బుధవారం కూడా కంటిన్యూ కానున్నది.