బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేయాలి: హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహా

రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు.

Update: 2024-06-13 15:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. గురువారం ఆయన సెక్రటేరియట్‌లో వైద్యాధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 60 ఏళ్లుగా విశిష్ట సేవలను అందిస్తున్న నారాయణగూడ ఐపీఎంలో మరింత స్పీడ్‌గా సేవలు అందించాలన్నారు. ఇందుకోసం ఐపీఎంలోని ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలన్నారు. దీంతో పాటు అన్ని బ్లడ్ బ్యాంక్‌లలో స్టోరేజ్ కెపాసిటినీ పెంచాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో మెరుగైన పనితీరును కలిగిన 14 బ్లడ్ బ్యాంకులలో ప్లాస్మాను వేరు చేసే యంత్రాల(కాంపొనెంట్ అప్ గ్రేడేషన్)ను సమకూర్చుకోవాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 63 బ్లడ్ బ్యాంకులలో శుక్రవారం (జూన్ 14) ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా డొనేషన్స్ నిర్వహించాలన్నారు. రక్త దాన ఆవశ్యకతను వివరించాలన్నారు. బ్లడ్ క్యాంపులు నిర్వహించి రక్తాన్ని సేకరించాలన్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ హైమావతి, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, ఐపీఎమ్ డైరెక్టర్ డాక్టర్ శివ లీల, మెడికల్ అండ్ హెల్త్ అదనపు డైరెక్టర్ డాక్టర్ అమర్ సింగ్ లు పాల్గొన్నారు.


Similar News