Harish Rao : నేనూ అదే చెప్పాను.. రుణమాఫీ రాజీనామాపై హరీష్ రావు ఆసక్తికర ట్వీట్ ఇదే

ఆగస్టు 15న పూర్తి రైతు రుణమాఫీతో తాము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, దమ్ముంటే హరీష్ రావు తన పదవికి రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-08-18 11:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆగస్టు 15న పూర్తి రైతు రుణమాఫీతో తాము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, దమ్ముంటే హరీష్ రావు తన పదవికి రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రుణమాఫీ సక్రమంగా నిర్వహించలేదని హరీష్ రావు ఇటీవల చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి రుణమాఫీ రాజీనామా చాలేంజ్ టాపిక్‌పై హరీష్‌రావు ఎక్స్ వేదికగా ఓ వీడియో పంచుకున్నారు. ‘మీ పార్టీ ప్రజా ప్రతినిధులే రైతు రుణమాఫీ కాలేదు అంటున్నారు. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలో, ఎవరు ఏటిలో దూకి చావాలో, ఎవరికి చీము నెత్తురు లేదో, ఎవరు అమర వీరుల స్తూపం దగ్గర ముక్కు భూమికి రాయాలో, ఎవరు రాజీనామా చెయ్యాలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి’ అని ప్రశ్నించారు. కోదండ రెడ్డి, కోదండరాం రెడ్డి, ఆది శ్రీనివాస్ ముగ్గురు కూడా రుణమాఫీ సంపూర్ణంగా కాలేదని ఒప్పుకున్నారని వెల్లడించారు.

నేనూ అదే చెప్పాను.. రాష్ట్రంలో పాక్షికంగా మాత్రమే రుణమాఫీ జరిగిందని.. 31 వేల కోట్లు అని చెప్పి 17 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు అని నేనంటే ఎందుకు రంకెలేస్తున్నారని తెలిపారు. రుణమాఫీ అయిపోయి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎందుకు రోడ్లెక్కి నిరసనలు తెలియచేస్తున్నారు. ఎందుకు మీ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నరు.. అని ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడడం, తొండి చేసైనా మేమే గెలిచినం అనే వైఖరి ప్రదర్శించడం అవివేకం అవుతుందన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి, రుణమాఫీ ప్రక్రియను తూతూ మంత్రంగా కాకుండా సమగ్రంగా పూర్తి చేయాలని, రైతులందరికీ న్యాయం చేయాలని సీఎం రేవంత్‌ను కోరారు.

Tags:    

Similar News