Harish Rao: 'కేంద్రం నిధులు దారిమళ్లిస్తున్నరు' .. రాష్ట్ర ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆరోపణలు
కేంద్రం నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు అవుతున్నా గ్రామాలకు ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రం నుంచి ఉపాధి హామీ, హెల్త్ మిషన్ వంటి పథకాల కింద వచ్చిన రూ.2,100 కోట్లను గ్రామాలకు ఇవ్వకుండా దారి మళ్లిస్తున్నదని ఆరోపించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ‘స్వచ్ఛదనం పచ్చదనం’ పేరుతో ఆగస్టు 5 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. గత పదేళ్లలో హరితహారం మూడు నాలుగు నెలలు పండగలా సాగేదని, నేడు ఈ కార్యక్రమం మొక్కుబడిగా మాత్రమే నిర్వహిస్తున్నారన్నారు. గతంలో తాము పారిశుద్ధ్య వారోత్సవాలు చేసేవాళ్లమని, వర్షాలు రాకముందే గ్రామాల్లో శుభ్రతకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. కానీ ఈ ప్రభుత్వం ఆ పథకం పేరు మార్చివేసినా గ్రామ పంచాయతీలకు నయా పైసా ఇవ్వలేదని దుయ్యబట్టారు.
డెంగీ, మలేరియా ప్రబలుతున్నయి...
మొదటి రోజు సమస్యలను గుర్తించాలని రెండో రోజు ఓహెచ్ఆర్ఎస్ క్లీనింగ్, తాగునీటి పైపుల బాగు చేయాలని నిర్ణయించారని, కానీ గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ ఎక్కడుందని? ఆయిల్ బాల్స్ ఎక్కడ? ఉన్నాయని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాలు నిర్వీర్యం అయిపోయాయన్నారు. ‘స్వచ్ఛదనం.. పచ్చదనం’ మొక్కుబడిగా చేయడం తప్ప ఏమీ లేదని, ఈ కార్యక్రమాల కోసం ప్రభుత్వం నుంచి నిధులు, ప్రణాళిక లేవని ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీలోని ట్రాక్టర్లకు డీజిల్ లేదు, కరెంట్ బుగ్గలకు డబ్బులు లేవు, కూలీలకు డబ్బుల్లేవని విమర్శించారు. గ్రామాలు చెత్తకుప్పలుగా మారాయని ఓ వైపు డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలుతుంటే మరోవైపు దవాఖానల్లో మందులు, మంచాలు లేవని పేర్కొన్నారు. పచ్చదనం, పరిశుభ్రత లోపించడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలని డిప్యూటీ సీఎంను కోరుతున్నామని హరీశ్‌రావు తెలిపారు.