Thanneeru Harish Rao : హరీష్ రావుని అడ్డుకున్న పోలీసులు

హైడ్రా భయంతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు గాంధీ హాస్పిటల్‌కు వెళ్లిన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నేతలను పోలీసులు గేటు బయటే అడ్డుకున్నారు.

Update: 2024-09-28 08:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా భయంతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు గాంధీ హాస్పిటల్‌కు వెళ్లిన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నేతలను పోలీసులు గేటు బయటే అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు గాంధీ హాస్పిటల్ వద్దకు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నేతలు ఆసుపత్రి వద్దకు రాగానే గేటు బయటే అడ్దుకున్నారు. పోలీసులు వారితో చర్చించిన పిదప వెంట వచ్చిన కార్యకర్తలతో కాకుండా కేవలం హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సహా మరికొందరు ముఖ్యనేతలను మాత్రమే ఆసుపత్రి లోనికి అనుమతించారు. అంతకుముందు హైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు చేరుకుని బీఆర్ఎస్ నేతలను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు.

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీష్ రావు హైడ్రా బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బాధితుల వద్దకు రానుందని తెలిపారు. హైడ్రా బాధితులంతా తమ కుటుంబ సభ్యులని, మీ కోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయన్నారు. మీరు ఎప్పుడైనా రావచ్చు, మీ వెంటే ఉంటారని భరోసా ఇచ్చారు. బాధితులకు రక్షణ కవచంలా ఉంటామన్నారు. బాధితులకు లీగల్ సెల్ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్ హయాంలో ప్రజలకు ఇబ్బందులు కలగలేదన్నారు. సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. పేదల ఇళ్లను కూల్చివేసి మూసీపై పెద్ద భవనాలకు అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. 100 రోజుల్లో ఆరు హామీలను అమలు చేసే అంశంపై దృష్టి సారించాలని చెప్పారు. హైదరాబాద్ ప్రతిష్టను సీఎం రేవంత్ దెబ్బతీస్తున్నారన్నారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించాకే మూసీపై ముందస్తుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కూకటపల్లిలో హైడ్రా బాధితుడు బుచ్చమ్మది ఆత్మహత్య కాదు, రేవంత్రెడ్డిది హత్య అని... ఇల్లు కట్టుకుని ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు చేసిందని, ఆ ఇల్లు కూలితే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనన్న బాధతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్నారు.


Similar News