త్వరలో మరో ఆరు మెడికల్​ కాలేజీలు.. మంత్రి హరీష్​ రావు

నాణ్యమైన వైద్యానికి, వైద్య విద్యకు తెలంగాణ హబ్ గా మారిందని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు.

Update: 2023-04-11 17:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నాణ్యమైన వైద్యానికి, వైద్య విద్యకు తెలంగాణ హబ్ గా మారిందని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. గడిచిన ఏడాదిలో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకొని ఎంతో వృద్ధి సాధించామన్నారు.ఈ ఏడాది కూడా మరో 9 మెడికల్ కాలేజీల్లో వంద ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించుకోబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే కుమ్రంభీం ఆసిఫాబాద్ వంటి మారుమూల జిల్లాతో పాటు, కామారెడ్డి, ఖమ్మం మెడికల్ కాలేజీలకు అనుమతులు రావడం గొప్ప విషయం అన్నారు. మిగతా కాలేజీలకు అతి త్వరలోనే పర్మిషన్లు వస్తాయన్నారు. మంగళవారం ఆయన డైరెక్టర్​మెడికల్​ఎడ్యుకేషన్​అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్​రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2014-15 లో ఎంబీబీస్ సీట్లు 2950 ఉంటే, ప్రస్తుతం 7090 కు చేరాయన్నారు. పీజీ సీట్లు 1183 నుంచి 2548కు పెరిగాయన్నారు.

65 మందికి కొత్తగా ప్రొఫెసర్ ప్రమోషన్స్ ఇచ్చామన్నారు.210 అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్లు త్వరలో ఇవ్వబోతున్నామని తెలిపారు. త్వరలో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ పూర్తి అవుతుందన్నారు.ఇక మెడికల్ కాలేజీల్లో రోల్ మోడల్ గా టీచింగ్ ఫ్యాకల్టీ ఉండాలన్నారు. ర్యాగింగ్​లు లేకుండా మానిటరింగ్​ చేయాలన్నారు. ఇప్పటికే 800 మంది పీజీ లను జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు, వైద్య విధాన పరిషత్ ప్రధాన ఆసుపత్రులకు పంపించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్పెషాలిటీ సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ జిల్లాల్లో వీరిని కేటాయించామన్నారు. క్లినికల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డ్యూటీల విషయంలో సూపరింటెందెంట్స్ దే లేదా పూర్తి బాధ్యతని, రౌండ్ ద క్లాక్ సేవలు అందించాలన్నారు.ఎన్ఎంసీ నిబంధనలు ప్రకారం నడుచుకునేలా మెడికల్ కాలేజీలను చూడాల్సిన బాధ్యత సూపరింటెండెంట్ ల పైన ఉన్నదన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి శ్రీనివాస రావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లా ఆసుపత్రులు సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Tags:    

Similar News