Harish Rao: ప్రజారోగ్య సంరక్షణను ప్రభుత్వం గాలికొదిలింది: మాజీ మంత్రి హరీష్‌రావు

ప్రజారోగ్య సంరక్షణను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Update: 2024-08-24 12:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రజారోగ్య సంరక్షణను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ వైద్య రంగం ఉన్నత శిఖరాలకు చేరి దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అనేక విప్లవాత్మక పథకాలకు, తెలంగాణ రాష్ట్రం శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేసిందని తెలిపారు. నిర్దిష్టమైన ప్రణాళిక, పటిష్టమైన చర్యలతో వైద్య రంగంలో అట్టడుగున ఉన్న రాష్ట్రాన్ని దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపామని అన్నారు. కానీ, తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో వైద్యా, ఆరోగ్య శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. కాంగ్రెస్ పాలన పుణ్యమా అని మళ్లీ.. ‘నేను రాను బిడ్డ సర్కారు దవాఖానాన’ అన్న రోజులు పునరావృతం అయ్యాయంటూ ఎద్దేవా చేశారు.

వైద్య, ఆరోగ్య శాఖలో నిర్లక్ష్యం నిరుపేదలకు శాపంగా పరిణమించిందని కామెంట్ చేశారు. రాష్ట్రంలో రోజురోజుకు మలేరియా, డెంగీ లాంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని తెలిపారు. విష జ్వరాలతో ప్రభుత్వాసుపత్రుల సహా పడకలు దొరకని పరిస్థితి ఉందని అన్నారు. ఇటీవలే ఒక్కరోజే డెంగీతో ఐదుగురు మృత్యువాత పడిన విషయాన్ని గుర్తు చేశారు. సర్కార్ నిర్లక్ష్య ధోరణితో ఎంతోమంది కుటుంబాల్లో విషాదం నిపిందని.. ఇవన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై ప్రభుత్వం స్పందించి వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించాలని హరీష్ అన్నారు.     


Similar News