Harish Rao: ప్రతిపక్షంలో రజినీ.. ఇప్పుడు గజినీ.. మాటమార్చడంలో సీఎం పీహెచ్‌డీ పట్టా: హరీశ్ రావు

రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.

Update: 2024-12-02 07:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మాట మార్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పీహెచ్ డీ చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఈ ఏడాది కాలంలో అనుభవంలోకి వచ్చింది మోసం, దగా అని, అన్నవస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు ఊడి పోతాయని రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో నిరూపితమైందన్నారు. కాంగ్రెస్ (Congress) ఏడాది పాలన, సీఎం రేవంత్ డబుల్ స్టాండర్డ్స్ పై తెలంగాణ భవన్ వేదికగా హరీష్ రావు వీడియో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాటం తీరు మాట మాట మార్చటం, పూటకో పార్టీ మార్చడం ఈ రెండూ రేవంత్ కు వెన్నతో పెట్టిన విద్యలు అని విమర్శించారు. రేవంత్ పాలనలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకమైందని పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు పెట్టొద్దని గిరిజన బిడ్డలు ఎదురుతిరిగితే, అర్ధరాత్రి లగచర్లను రణరంగంగా మార్చారు రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిపక్షాల కుట్ర అంటున్నారని మండిపడ్డారు. నక్సలైట్లు ఉంటే బాగుండేమో అని ముసలి కన్నీరు కార్చిన రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో మూడు బూటకపు ఎన్ కౌంటర్లు జరిగాయని ఆరోపించారు.

చావుకబురు చల్లగా చెప్పిస్తున్నాడు:

బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉండగా మూడో పంటకు రైతుబంధు ఎందుకివ్వరు అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. తాను సీఎం అయ్యాక మూడో పంట మాట దేవుడెరుగు, మొదటికే మోసం తెచ్చిండని హరీశ్ రావు విమర్శించారు. ఎన్నికలకు ముందు కౌలు రైతుకూ, అసలు రైతుకూ ఇద్దరికీ రైతుబంధు ఇస్తామని చెప్పి ఇప్పుడేమో ఎవరికియ్యాలో వాళ్లిద్దరే తేల్చుకోవాలని వ్యవసాయ మంత్రితో చావుకబురు చల్లగ చెప్పించాడని విమర్శించారు. ఎన్నికలకు ముందు రైతుబంధు ఆపిందే మీరు. రైతు బంధు ఎగ్గొట్టి మాపై నెపం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ఆడబిడ్డలందరికీ మంచి డిజైన్లతో రెండు చీరలిస్తమని మాటిచ్చి చీర కాదు కదా, కనీసం జానెడు జాకెట్ ముక్క కూడా ఇవ్వకుండా పండుగపూట ఆడబిడ్డల్ని బాధపెట్టారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద ఉచితంగా రెగ్యులరైజేషన్ చేయాలని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి 15 వేల కోట్లు ముక్కుపిండి వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నదని ధ్వజమెత్తారు. ఏడాది లోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేసి మోసం చేశారని మండిపడ్డారు.

ఆ అడ్డమైనోడు ఎవడు?

తాము గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తే అడ్డమైన ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్న అడ్డమైనోడు ఎవడు? మెడకాయ మీద తలకాయ లేనోడు ఎవడు అని ప్రశ్నించారు. కట్టడాల కూల్చివేతలపై ఈ సీఎం కుహనా వైఖరి ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో ఒకటి రెండు అక్రమ నిర్మాణాలను కూలిస్తే.. అది జాతి ద్రోహం, క్రిమినల్ వేస్ట్ అని కిరాక్ మాటలు మాట్లాడాడు. అధికారంలోకి రాగానే ఇష్టం వచ్చినట్లు పేదల ఇండ్లను కూలుస్తున్నాడు. అడ్డుపడితే బుల్డోజర్ తో తొక్కిస్తా అని బెదిరిస్తూ, విధ్వంసం సృష్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇపుడు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా రేవంత్ సృష్టించిన క్రిమినల్ వేస్ట్ పేరుకుపోయిందని ఏడాది పాలనలో కూల్చిన ఇల్లే ఎక్కువ కట్టినవి ఒక్కటీ లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు పోలీసుల గురించి కన్నీరు పెట్టిన రేవంత్ రెడ్డి ఇపుడు పోలీసు కుటుంబాలను రాచి రంపాన పెడుతున్నడని విమర్శించారు. ఏక్ పోలీసు కావాలని నినాదం ఇచ్చి ఆ హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు 39 మంది ఉద్యోగాలు తేసేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పరిపాలనలో తాగుబోతుల తెలంగాణ చేస్తరా?అని విమర్శించింన రేవంత్ రెడ్డి తాను అధికారంలోకి రాగానే ఊరూ, పేరూ లేని బ్రాండ్లు తెచ్చి మద్యం అమ్మే ప్రయత్నం చేస్తున్నాడని ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు విధిస్తున్నాడు, అమ్మకాలు తగ్గితే మెమోలు జారీ చేస్తున్నాడని ఆరోపించారు. నాడు గ్రామానికి ఒక బెల్ట్ షాపు ఉంటే, నేడు గల్లి గల్లికి తెచ్చిండు రేవంత్ ప్లాన్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

ఈరోజు రేవంత్ ప్రారంభించే కంపెనీకి కాళేశ్వరం నీళ్లే:

కాళేశ్వరం గురించి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఒకవైపు కాళేశ్వరంపై లేనిపోని విమర్శలు చేస్తూనే, మరోవైపు కాళేశ్వరం నీళ్లను విడుదల చేసుకొంట ఫొటోలు దిగుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ ఈరోజు సిద్దిపేటలో ప్రారంభించే కోకపేట కంపెనీ కూడా కాళేశ్వరంలో భాగమేనని కోకాపేట కంపెనీకి నీళ్ళు కూడా కాళేశ్వరం నుండే వస్తున్నాయన్నారు. అందుకే ఆ కంపెనీ అక్కడ పెట్టింది. కేసీఆర్ ప్లాన్ చేశారని చెప్పారు. రేవంత్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్ కు పాపం సోనియా గాంధీ కూడా అతీతం కాదని పచ్ఛ పార్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీ బలిదేవత, మూడురంగుల జెండా పట్టి ముఖ్యమంత్రి కాంగానే అమ్మ కాళ్లు కడుక్కుని నెత్తిన చల్లుకోవాలే అంటున్నాడని విమర్శించారు. అవసరమొస్తే కాళ్ళు పట్టగలడు, ఆ తర్వాత ఆ కాళ్ళనే గుంజి పడగొట్టగలడు. పార్టీ ఫిరాయించినన వారిని రాళ్లతో కొట్టి చంపమన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇల్లిల్లూ, గడపగడప తిరుగుతూ, కడుపుల తలకాయ పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని తన పార్టీలోకి చేర్చుకుంటున్నాడని విమర్శించారు. ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో రేవంత్ మార్కు ప్రజా పాలన వర్ధిల్లుతున్నదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా శిలా ఫలకాలపై ముఖ్యమంత్రి, మంత్రుల పేర్లు ఎందుకు? పేర్లు లేకుండా హోదాలు పెడితే చాలు అని ధర్మపన్నాలు వల్లించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే తన పేరుతోపాటు, ఫొటో కూడా పెట్టించుకుంటున్నాడని, ఎక్కడ చూసినా పేరు, ఫోటో ఉంటుందని విమర్శించారు.

ప్రతిపక్షంలో ఉండగా రజనీ, ఇప్పుడు గజినీ:

మా ప్రభుత్వం యాడ్స్ ఇచ్చినప్పుడు ఎవనయ్య జాగిరని మీరు యాడ్స్ ఇస్తున్నారని మాట్లాడారు. మరి ఇప్పుడు ఎవనయ్య జాగిరని తాను యాడ్స్ ఇస్తున్నాడని ప్రశ్నించారు. మేమిస్తే బ్యాడ్ అట. తానిస్తేనేమో యాడ్ అట. మూసీ ప్రక్షాళన సందర్భంలో ముఖ్యమంత్రి మాయ మశ్చీంద్ర మాటలు చూస్తే అది నోరా.. మోరా అనిపిస్తుందన్నారు. తన నోటితోనే తానే ఐదేళ్లలో లక్షా 50 వేల కోట్లతో మూసీ ప్రాజెక్టు చేపడుతున్నామని చెప్పిన సీఎం ఆ తర్వాత లక్షా యాభై వేల కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని ఉల్టా మనల్నే అడుగుతున్నాడని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రభుత్వ సలహాదారులకు క్యాబినెట్ హోదా ఇవ్వద్దని కోర్టుకు పోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు విచ్చలవిడిగా సలహాదారులను నియమించి, వారికి క్యాబినెట్, సహాయ మంత్రి హోదా కట్టబెడుతున్నాడని విమర్శఇంచారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా రజనీ, ఇప్పుడు గజినీ అని సెటైర్ వేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూ ట్యూబ్ ఛానళ్ల ద్వారా దుర్మార్గమైన విషప్రచారం చేసి ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్లు అరాచక ఛానళ్లు అంటూ వాళ్లపై అడ్డగోలుగా కేసులు పెడుతున్నాడు. ఏడాది పాలనలో నిర్బంధాలు, అణిచివేతలు, లాఠీ ఛార్జీలు, కంచెలు, ఆంక్షలు నిత్యకృత్యమయ్యాయన్నారు. ఏడాది పాలనలో కూల్చివేతలు తప్ప రేవంత్ నిర్మించినవి ఏమీ లేవని విమర్శించారు.

Tags:    

Similar News