Gutha: ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా నడుచుకోవాలి.. మండలి చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సపోర్ట్ ఎల్లవేళలా ఉంటుందని ఆయన తెలిపారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టడం అభినందనీయమన్నారు. సోమవారం శాసన మండలిలోని తన ఛాంబర్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కీలక భూమిక పోషించిన జైపాల్ రెడ్డి కృషిని ఎప్పటికి మరవలేమన్నారు. ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా స్వాగతించాలని కోరారు. రేవంత్ రెడ్డి బంధుప్రీతితో ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెడుతున్నారని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రం సాధించడం కొరకు కేంద్ర మంత్రి హోదాలో ఆయన ఎనలేని కృషి చేశారని, పేరుపెట్టడమంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే అన్నారు.
గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఆర్ధిక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటుందని, అయినప్పటికీ రైతులను ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో, ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసాను జనవరి 26 నుండి ఎలాంటి షరతులు లేకుండా సేద్యం చేసే భూమికంతటికి ఇవ్వడం అభినందనీయమన్నారు. రైతు భరోసాను రూ.10వేల నుంచి రూ.12వేలకు పెంచడం గొప్ప నిర్ణయమని తెలిపారు. భూమిలేని రైతు కూలీలకు ఏటా 12వేల సాయం అందించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ప్రజాయోగ్యంగా ఉందని, ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా నడుచుకోవాలన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు ఎస్ఎల్బీసీ, డిండి, ఉదయసముద్రం ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారి అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సపోర్ట్ ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. విమర్శలు, దుష్ప్రాచారం చేయడమే పనిగా ప్రతిపక్ష పార్టీలు పెట్టుకోవద్దని, ప్రభుత్వానికి సరైన సూచనలు, సలహాలు ఇస్తూ ప్రజలకోసం పని చేయాలని సూచించారు.