మార్చి చివరి కల్లా గ్రూప్​–1 నియామకాలు పూర్తి : సీఎం రేవంత్​రెడ్డి

దేశంలోనే ఒకే సంవత్సరంలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అన్నారు.

Update: 2025-01-05 16:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే ఒకే సంవత్సరంలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వ మొదటి ఏడాదిలోనే 55143 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని ఆయన వెల్లడించారు. వచ్చే మార్చి చివరి నాటికి గ్రూప్​1 నియామకాలు చేపడుతామని, 14 యేండ్ల తరువాత తొలిసారిగా గ్రూప్​–1 నియామకాలు జరుగుతున్నాయన్నారు. ఆదివారం ప్రజా భవన్​లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సివిల్స్ ఇంటర్వ్యూ కు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు. అదే విధంగా సింగరేణి ఉద్యోగులకు ప్రమాద బీమాను కోటి రూపాయల నుంచి రూ.1.25కోట్లకు పెంచారు. దీనికి సంబంధించి బ్యాంక్​ఆఫ్​ బరోడా తో ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ మొదటి తెలంగాణ ఉద్యమం మొదలైంది ఉద్యోగ సమస్య మీద నేనని, అది పాల్వంచలో మొదలైందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. మలి తెలంగాణ ఉద్యమం ఉద్యోగుల సమస్యల మీదనే ప్రారంభమైందన్నారు.

తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ సాధించుకుందన్నారు. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్ట పోయారన్నారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయామనే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని సీఎం తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ప్రజాపాలన ఏర్పడిందన్నారు. అప్పటి వరకు ప్రగతి భవన్​గా పిలవబడే ఈ భవనం చుట్టూ భారత్​ పాకిస్థాన్​సరిహద్దుల మధ్య ముళ్ల కంచేలు వేసి ఎప్పుడు సైన్యం మోహరించి ఉంటుండనో ఈ భవంతుల చుట్టూ అదే విధంగా పోలీసుల పహారాల చుట్టూ ఉండేదన్నారు. డిసెంబర్​7 నుంచి ముళ్ల కంచెలు బద్దలు కొట్టి ప్రజలకు స్వేచ్ఛ కల్పించడం జరిగిందన్నారు. సివిల్స్ లో మన రాష్ట్ర అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలని మా ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకు వచ్చామన్నారు. వెనకబాటుతనం నుంచి చర్చ జరిగినప్పుడు బీహార్​ చర్చకు వస్తుందని, అంతటి వెనకబాటు ఉన్న బీహార్ నుంచి అత్యధికంగా సివిల్స్ లో రాణిస్తున్నారని, అలాంటి ప్రత్యేక శ్రద్ధ మన రాష్ట్రంలో కూడా ఉండాలని, వారికి ఆర్థికంగా సహకారం అందించాలని రాజీవ్ సివిల్స్ అభయహస్తం ద్వారా రూ.లక్ష సహాయం అందిస్తున్నామన్నారు.

ఇది ఆర్థిక సాయం కాదు ప్రభుత్వం వారికి అందిస్తున్న ప్రోత్సాహంగా భావించాలన్నారు. కష్టంతో కమిట్మెంట్ ఉంటేనే విజయం వర్తిస్తుందన్నారు. ఇంటర్వ్యూకు వెళ్లే ప్రతి ఒక్కరూ సివిల్స్ లో సెలెక్ట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్​ప్రభుత్వ మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టిందన్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో ఒక రాష్ట్రంలో ఒక సంవత్సరంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేపట్టలేదన్నారు. 2011 తర్వాత గ్రూప్​ 1 నియామకాలు చేపట్టలేదన్నారు. 14 ఏళ్లుగా గ్రూప్ –1 పరీక్ష నిర్వహించలేదని, కానీ తాము అడ్డంకులను, కుట్రలను అధిగమించి 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించామని, మార్చి 31 లోగా గ్రూప్ –1 ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయబోతున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కోర్టు కేసులను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు.

గ్రూప్–1 విషయంలో జీవో ఇచ్చినప్పుడు, ప్రిలిమ్స్​నిర్వహించినప్పుడు, పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిసిన ప్రతిపక్షాలు న్యాయపరంగా లిటిగేషన్​లు సృష్టించాలని చూస్తోందన్నారు. ఏదో విధంగా గ్రూప్​–1 ఉద్యోగాల నియామకాలను అడ్డుకోవాలని ప్రతిపక్షం కుట్ర చేసినా, ప్రభుత్వం చేపట్టిన చర్యలన్ని సరియైనవేనని, హైకోర్టు, సుప్రీంకోర్టు సైతం చెప్పిందన్నారు. అడ్డంకులు అన్ని తొలగిపోయాయని అన్నారు. గ్రూప్​ 1 విజయవంతంగా పూర్తి చేయడం ఒక విజయమని ఆయన అన్నారు. ఉద్యోగాల నియామకాల్లో దేశానికే తెలంగాణ ఆదర్శం గా నిలబడిందన్నారు. రాజకీయ నాయకులు ఓడిపోతే ఆరు నెలలు పదవులు లేకపోతే బాధపడుతున్న వారికి కుటుంబ సభ్యులకు పదవులు ఇస్తున్నారని, అలాంటి సమయంలో 14 సంవత్సరాలు యుక్త వయస్సును వదులుకోని యువత గందరగోళ పరిస్థితుల్లో చిక్కుముడులను విప్పుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం ఆలోచించేదే యువత భవిష్యత్ కోసమేనని, జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వంలో ఖాళీలు ఉన్న ఉద్యోగాల భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను అన్నిరకాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనర్నారు. దేశంలో అత్యధికంగా మన రాష్ట్రం నుంచి సివిల్స్ లో ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా నని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ సింగరేణిని దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. సివిల్స్ ఇంటర్వ్యూ కు ఎంపికైన వారికి ఆర్థిక సాయం అందించడం గర్వకారణమన్నారు. ఇంటర్వ్యూ సమయంలో ఢిల్లీలో వసతి కల్పిస్తామని ప్రకటించారు. గత పాలకులు సింగరేణిని వ్యక్తిగత, రాజకీయ అవసరాలకు వాడుకున్నారని, తాము సింగరేణిని ప్రపంచంలోనే నేటి సంస్థగా నిలబెట్టాలనుకుంటున్నామంటూ భట్టి తెలిపారు. కార్మికుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రమాదంలో చనిపోయిన కార్మిక కుటుంబాలకు కోటి రూపాయలకు పైగా ఉచిత ప్రమాద బీమా అందిస్తున్నామన్నారు. సింగరేణిలో నిరుపయోగంగా ఉన్న ప్రాంతాల్లో సోలార్, పంపు స్టోరేజ్ ద్వారా గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య రహితంగా విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్ పవర్ వైపు వెళ్తున్న పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో బొగ్గుపై ఆధారపడే పరిస్థితి తగ్గి ఆ గనులు మూతపడే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ముందుచూపుతో సింగరేణిని మైనింగ్ రంగాల్లో దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందనర్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్​రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు కూనమనేని సాంబశివరావు, గండ్ర సత్యనారాయణ రావు, కోరం కనకయ్య, విజయరమణారావు, కాలే యాదయ్య, అనిల్ రెడ్డి, ఎమ్మెల్సీ టి.భాను ప్రసాదరావు, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం, జనక్​ప్రసాద్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్​ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.


Similar News