Bandi Sanjay: సిరిసిల్లకు పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయండి
సిరిసిల్లకు పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని కేంద్ర టెక్స్ టైల్ మినిస్టర్ ను బండి సంజయ్ కలిసి విజ్ఞప్తి చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో గిరిరాజ్ సింగ్ ను కలిసి వినతిపత్రం సమర్పించిన బండి సంజయ్.. నేతన్నల పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేతన్నలు కొనుగోలు చేసేందుకు అవసరమైన ముడిసరుకు డిపో (యార్న్ డిపో)ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ముడిసరుకు ఖర్చుల కారణంగా నేతన్నలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సబ్సిడీని 80 శాతం మేరకు పెంచడంతో పాటు పావలా వడ్డీకే రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థనపై మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారని యార్న్ డిపో ఏర్పాటు, పవర్ క్లస్టర్ మంజూరుపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని బండిసంజయ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 80 శాతం సబ్సిడీ, పావలా వడ్డీకే రుణాలు వంటి అంశాల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు.