ఇసుక రీచ్‌ల కేటాయింపుపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. కొత్త పాలసీ తెచ్చేందుకు ప్లాన్
రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దళారుల ప్రమేయం లేకుండా, నేరుగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పాలసీని తయారు చేయాలని యోచిస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దళారుల ప్రమేయం లేకుండా, నేరుగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పాలసీని తయారు చేయాలని యోచిస్తున్నది. దీంతో వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక పాలసీలో దళారుల జోక్యం పెద్ద ఎత్తున ఉందనే విమర్శలు ఉన్నాయి. అలాగే స్థానికంగా ఉన్న మైనింగ్, రెవెన్యూ, ట్రాన్స్‌పోర్టు, పోలీసు అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు అందుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే కొత్త ఇసుక పాలసీని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సెక్రటేరియట్‌లోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఐటీడీఏలకే ఇసుక రీచ్‌ల నిర్వహణ
కొత్త పాలసీలో ట్రైబల్ ఏరియాల్లోని ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ఐటీడీఏలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. రీచ్‌లో ఇసుక తవ్వడం నుంచి మొదలుకుని డంపింగ్ ఏరియా వరకు రవాణా బాధ్యతలను ట్రైబల్ ఏజెన్సీకి ఇవ్వాలనే యోచనలో ఉంది. అయితే, వచ్చిన లాభాల్లో కొంత వాటాను రీచ్ హక్కులు ఉన్న ట్రైబల్స్‌కు ఇచ్చేలా పాలసీ తయారుచేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. దీంతో మధ్యవర్తులకు చెక్ పెట్టడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చర్యలు తీసుకోవచ్చనే అభిప్రాయంలో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్టు తెలిసింది. ఆర్థిక వనరులు ఉన్న ట్రైబల్స్ తమే సొంతంగా ఇసుకను తవ్వి మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా విక్రయించుకోవచ్చు. అయితే రీచ్ యజమానికి అంతటి ఆర్థిక సామర్థ్యం ఉన్నదా? అనే అంశాన్ని స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు ధ్రువీకరణ చేసిన తరువాతే పర్మిషన్స్ ఇచ్చేలా కండీషన్స్ పెట్టనున్నట్టు తెలుస్తున్నది.
జియో ట్యాగింగ్, కంట్రోల్ రూమ్ మానిటరింగ్
కొత్త ఇసుక పాలసీలో ప్రతీ లారీకి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. లారీ స్టార్ట్ అయిన ప్రాంతం నుంచి మొదలుకుని ఇసుక అన్ లోడ్ చేసే వరకూ సదరు లారీ ఏఏ ప్రాంతాల్లో ప్రయాణించిందనే అంశాన్ని ఆరా తీయనున్నారు. అందుకోసం ఇసుక రీచ్‌లు, టోల్ గేట్ల వద్ద సీసీ కెమరాలను ఏర్పాటు చేసి వాటన్నిటిని హైదరాబాద్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయనున్నట్టు తెలుస్తున్నది.
ఓఆర్ఆర్ చుట్టూ డంపింగ్ యార్డులు
కొత్త పాలసీలో భాగంగా ఓఆర్ఆర్ చుట్టూ ఇసుక డంప్ యార్డులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఆ డంప్ యార్డులకు ఐటీడీఏలే ఇసుకను డంప్ చేసే బాధ్యతలు అప్పగించనున్నారు. అక్కడి నుంచి టీఎస్ఎండీసీ ద్వారా కస్టమర్లకు ఇసుకను అందించనున్నారు. ఈ పద్ధతి ద్వారా మధ్యవర్తులు, దళారుల ప్రమేయం తగ్గి ఇసుక తక్కువ ధరకే లభ్యమవుతుందనే అంచనాలో అధికారులు ఉన్నట్టు తెలుస్తున్నది.
నష్టపోతున్న ట్రైబల్స్
గిరిజన ప్రాంతాల్లోని ఇసుక తవ్వకాలతో ట్రైబల్స్ ఆర్థికంగా ప్రయోజనం పొందడం లేదు. ఇటు ప్రభుత్వానికీ అదాయం సమకూరడం లేదు. కానీ, మధ్యవర్తులు మాత్రం కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇసుక తవ్వకాల అనుమతి కోసం మైనింగ్ శాఖకు లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అంత మొత్తంలో డబ్బు లేకపోవడంతో గిరిజనులు తమ పేరు మీద ఉన్న రీచ్‌లను మధ్యవర్తులకు విక్రయిస్తున్నారు. అందుకు వారిచ్చే ఎంతోకొంత డబ్బుతో సంతృప్తిచేందుతున్నారు. కానీ, దళారులు మాత్రం రోజూ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అనుమతి ఇచ్చిన పరిధికంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇసుకను తవ్వుతున్నారు. ఇంకా రూల్స్‌కు విరుద్ధంగా లారీల్లో ఎక్కువ ఇసుకను లోడింగ్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు సహకరించిన స్థానిక మైనింగ్, రెవెన్యూ, ట్రాన్స్‌పోర్టు, పోలీస్ అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు అందుతున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయని తెలుస్తున్నది.
ట్రైబల్ ఏరియాల్లో దళారుల దందా
రాష్ట్రంలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఇసుక ఎక్కువగా లభ్యమవుతున్నది. ఈ క్రమంలో ఎక్కువ ఇసుక రీచ్‌లు ట్రైబల్ ఏరియాల్లోనే ఉన్నాయి. దీంతో 1/70 యాక్టు ప్రకారం కేవలం గిరిజనులకు మాత్రమే అక్కడ మైనింగ్ చేసే హక్కులుంటాయి. ప్రస్తుతం ట్రైబల్ ఏరియాల్లో ఉన్న మెజార్టీ ఇసుక రీచ్‌ల యజమానులు పేరుకే గిరిజనులు ఉంటారు. కానీ, ఎక్కడా వారు సీన్‌లో కనపడరు. కాగితాల వరకే సదరు గిరిజనుల పేరుమీద రీచ్‌లు కొనసాగుతుంటాయి. ఏటా కొంత డబ్బును ట్రైబల్స్‌కు ఇచ్చి, పెద్ద ఎత్తున లాభాలను దళారులు దండుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.