వీసీల నియామకంపై సర్కారు ఆచితూచి అడుగులు

రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలకు వైస్ చాన్స్ లర్ల నియామకంపై సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తోంది.

Update: 2024-10-04 01:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలకు వైస్ చాన్స్ లర్ల నియామకంపై సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదాలకు ఆస్కారం ఇవ్వొద్దని భావిస్తోంది. అందుకే వీసీల కోసం దరఖాస్తు చేసుకున్న వారి డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా ప్రొఫెసర్ల నుంచి వచ్చిన దరఖాస్తులను వడపోస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను నివారించేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైస్ చాన్స్ లర్ల నియామకానికి సామాజిక సమీకరణ అంశాలను సైతం పరిగణలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే సెర్చ్ కమిటీల నియామకంపై కసరత్తును ముమ్మరం చేశాయి.

ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, పాలమూరు యూనివర్సిటీలకు వీసీల నియామకానికి గురువారం ముందడుగు పడింది. సెక్రటేరియట్ లో సెర్చ్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ప్రొఫెసర్ల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎస్ శాంతికుమారి సెర్చ్ కమిటీ సభ్యురాలిగా పాల్గొన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు జరగాల్సిన ఓయూ సెర్చ్ కమిటీ సమావేశాన్ని.. ఉదయం 10 గంటలకే నిర్వహించారు. యూఎస్ లో ఉన్న ఒక సభ్యుడి సౌకర్యార్థం సమయాన్ని మార్చినట్లు తెలిసింది. కాగా ఆయన ఆన్లైన్లో సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పాలమూరు, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ సమావేశాలు జరిగాయి. కాగా అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ సెర్చ్ కమిటీ సమావేశం సైతం జరగాల్సి ఉండగా సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఇది వాయిదా పడింది. అంబేద్కర్ వర్సిటీతో పాటు జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీల సెర్చ్ కమిటీ మీటింగ్ సైతం వాయిదా పడింది. తాజాగా కేయూ సెర్చ్ కమిటీ మీటింగ్ సైతం వాయిదా పడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సెర్చ్ కమిటీ మీటింగ్ సమావేశం పూర్తయిన ఒక్కో వర్సిటీకి ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను సభ్యులు ఫైనల్ చేశారు. శుక్రవారం జేఎన్టీయూ, తెలంగాణ, శాతవాహన వర్సిటీలకు సంబంధించిన సెర్చ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే వీసీల నియామకానికి దరఖాస్తు చేసుకున్న పలువురు ప్రొఫెసర్లు అత్యంత కీలకమైన మంత్రులతో పాటు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. తమకున్న ఇన్ ఫ్లుయెన్స్ ను ఉపయోగించుకుని వీసీలుగా నియామకమవ్వాలని చూస్తున్నారు. అయితే పైరవీలను కాదని క్లీన్ బయోడేటా ఉన్నవారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వీసీల నియామకానికి టాలెంట్, క్వాలిటీని ప్రాధాన్యతగా తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది. అవినీతి మచ్చ లేని వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాలని సర్కార్ చూస్తోంది. వీసీల నియామకానికి సంబంధించి బయోడేటాతో పాటు సంబంధిత కుటుంబీకుల వివరాలను సైతం ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి అందినట్లుగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీసీల నియామకానికి సంబంధించి సామాజిక సమీకరణలను సైతం పరిగణలోకి తీసుకోనుందని టాక్. బీఆర్ఎస్ హయాంలో పది వర్సిటీల్లో ఆరు ఓసీలకు, రెండు బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చారు. మైనార్టీలకు ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలనే దృక్పథంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మొత్తం పది వీసీ పోస్టుల కోసం 312 మంది నుంచి 1,382 దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. గురువారం పలు యూనివర్సిటీల సెర్చ్ కమిటీలు భేటీ అయ్యాయి. శుక్రవారం కూడా సెర్చ్ కమిటీ భేటీ కొనసాగనుంది.


Similar News