ఇంజినీరింగ్ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. సీట్ల పెంపునకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్ల పెంపునకు సర్కారు అనుమతులు ఇచ్చింది. కొత్తగా సుమారు పదివేల వరకు బీటెక్ సీట్లకు అనుమతులివ్వగా బీటెక్ కన్వీనర్ కోటాలో
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్ల పెంపునకు సర్కారు అనుమతులు ఇచ్చింది. కొత్తగా సుమారు పదివేల వరకు బీటెక్ సీట్లకు అనుమతులివ్వగా బీటెక్ కన్వీనర్ కోటాలో అడ్మిషన్‌కు మరో 7024 సీట్లు పెరిగాయి. సీఎస్ఈ, దాని అనుబంధ బ్రాంచుల్లోనే ఈ సీట్లు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రస్తుతం పెరిగిన వాటితో కలిపి 1,11,480 సీట్లున్నాయి. దీంట్లో 70 శాతం కన్వీనర్ కోటాలో భర్తీ చేయనుండగా, మిగిలిన 30 శాతం మేనేజ్ మెంట్ కోటాలో నింపుతారు. కాగా ఈఏపీసెట్ ఫస్ట్ ఫేజ్‌లో కన్వీనర్ కోటాలో 78,694 సీట్లుకు 75,200 సీట్లు భర్తీ చేశారు.
ఇదిలా ఉండగా సెకండ్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే, ఆప్షన్లు పెట్టుకున్న సుమారు 20 వేలకు పైగా విద్యార్థులకు సీట్లు రాకపోవడం, అప్పట్లో 3,494 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో స్టూడెంట్లలో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో ప్రభుత్వం శుక్రవారం కొత్తగా పదివేలకు పైగా సీట్లకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో అర్బన్ ఏరియాల్లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో గతేడాది 90 శాతానికి పైగా సీట్లు నిండిన కాలేజీలకు, రూరల్‌లో 50 శాతానికి పైగా సీట్లు నిండిన కాలేజీలకు మాత్రమే కొత్త సీట్లకు సర్కారు అనుమతి ఇచ్చింది. అయితే, కొత్తగా అనుమతిచ్చిన సీట్లన్నీ కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ సీట్లే ఉండటం గమనార్హం.
ఇదిలా ఉండగా ఇంజినీరింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. శని, ఆదివారం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. దీనికి 29,777 సీట్లు అందుబాటులో ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. ఫస్ట్ ఫేజ్ లో 75,200 మందికి సీట్లు అలాట్ కాగా, ఇందులో 55,941 మంది మాత్రమే ఫీజు చెల్లించి, ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. 22,753 మంది సీట్లను వదులుకున్నారు. కొత్త సీట్లు 7024తో కలిసి.. సెకండ్ ఫేజ్‌కు 29,777 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 31లోపు సెకండ్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు.