TG Govt: బీపీ, షుగర్, క్యాన్సర్ పేషెంట్లకు గుడ్ న్యూస్

బీపీ, షుగర్, క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది...

Update: 2025-01-03 02:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) క్లినిక్‌లకు బాధితుల వివరాలు అటాచ్ చేసింది. గ్రామాలు, మండలాలు వారీగా లిస్టును మెర్జ్ చేయగా.. ఆయా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులపై నేరుగా దవాఖానల నుంచే మానిటరింగ్ కొనసాగనుంది. అంతే కాకుండా రెగ్యులర్‌గా ఫాలోఅప్ కోసం నోడల్ ఆఫీసర్లను సైతం నియమించనున్నది.

ప్రస్తుతం ఆశాలు, ఏఎన్ఎంల పర్యవేక్షణ

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌సీడీ స్క్రీనింగ్ పేరిట పేషెంట్లపై పర్యవేక్షణ కొనసాగుతున్నది. దీనిని ఆశాలు, ఏఏన్ఎంలు ఫాలో అప్ చేస్తున్నారు. ప్రతినెలా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులకు ఆయా వివరాలన్నీ సబ్‌మిట్ చేస్తున్నారు. రిస్క్ పేషెంట్లను గుర్తించి స్పెషలిస్టు డాక్టర్లకు రెఫర్ చేస్తున్నారు. అయితే.. ఈ ప్రాసెస్‌లో ఒక్కోసారి సమస్యలు వస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ గుర్తించింది. ఆశాలు, ఏఏన్ఎంలు సకాలంలో స్క్రీనింగ్ చేయకపోవడం.. పీహెచ్‌సీ డాక్టర్లు సరైన తీరులో స్పందించక పోవడంతో రోగులకు సమస్యలు వస్తున్నాయి. బీపీ, షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయి. కొన్ని రోజులుగా బీపీ, షుగర్ పేషెంట్లకు సకాలంలో ఎన్‌సీడీ కిట్లు అందడం లేదు. దీంతో బాధితుల నుంచి వైద్యారోగ్యశాఖకు వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆయా బాధితుల ఫాలో అప్, ట్రీట్‌మెంట్ బాధ్యతలను ఎన్‌సీడీ క్లినిక్‌లకు ఇస్తూ సర్కార్ ఆదేశాలిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 35 ఎన్‌సీడీ క్లినిక్‌లలో పేషెంట్లకు చికిత్స అందించనున్నారు.

22.94 లక్షల మందికి బీపీ, 11.9 లక్షల మందికి షుగర్..

30 ఏళ్లు దాటిన వారిలో 1.66 కోట్ల మందిని స్క్రీన్ చేయగా 22.94 లక్షల మందికి బీపీ, 11.9 లక్షల మందికి షుగర్ ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు గుర్తించారు. వీరందరి డేటా ఇప్పుడు ఎన్‌సీడీ క్లినిక్‌లకు చేరింది. ప్రభుత్వం సేకరించిన ఈ డేటా ద్వారా పేషెంట్లపై మానిటరింగ్ కొనసాగుతుంది. బీపీ, షుగర్ లెవల్స్‌ను బట్టి చెకింగ్‌లకు షెడ్యూల్‌ను ఫిక్స్ చేస్తారు. లెవల్స్ వారీగానే మెడిసిన్స్ సైతం వేర్వేరుగా ఎన్‌సీడీ క్లినిక్‌లలో అందుబాటులో ఉంచుతారు. రెగ్యులర్ అవేర్నెస్ కోసం వైద్యారోగ్యశాఖ తయారు చేసిన పాంప్లెట్‌ను పేషెంట్లకు అందజేస్తారు.

పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని..

ఏటా నాన్ కమ్యునికేబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) పెరుగుతున్నాయి. లైఫ్​స్టైల్ చేంజ్‌తో వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతున్నది. మరోవైపు నియంత్రణ చర్యలు సరిగా లేక వచ్చిన సంపాదనలో 60 శాతం అనారోగ్యానికి ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ఇది పేద పేషెంట్లపై ఆర్థికంగా భారం పడుతున్నది. అంతేగాక జీవిత కాలం తగ్గిపోయి, ఆయా కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. ఇటీవల అధికారులు ఈ అంశంపై స్టడీ చేసి ప్రభుత్వానికి ఓ రిపోర్టు ఇచ్చారు. దీని ఆధారంగా ఎన్‌సీడీ పేషెంట్లకు క్లినిక్‌లలోనే ట్రీట్‌మెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

కొత్త పేషెంట్ల వివరాలు అప్‌లోడ్ చేయాలి: దామోదర రాజనర్సింహా, హెల్త్ మినిస్టర్

కొత్తగా నమోదైన ఎన్‌సీడీ పేషెంట్ల వివరాలను, ఎప్పటికప్పుడు లిస్ట్‌లో అప్‌గ్రేడ్ చేయాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా ఆదేశించారు. ఎన్‌సీడీ క్లినిక్స్‌ను తొలుత టీచింగ్ హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేసి, తర్వాత జిల్లా, ఏరియా హాస్పిటల్స్‌కు విస్తరించాలని సూచించారు. ఎన్‌సీడీ వ్యాధుల నియంత్రణ, వాటి బారిన పడిన ప్రజలకు చికిత్స అందించడంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఆదేశించారు. ఈ మేరకు కోటిలోని టీజీఎంఎస్‌ఐడీసీ ఆఫీస్‌లో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్, డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీహెచ్ రవీందర్ నాయక్‌లతో మంత్రి రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో చేసిన ఎన్‌సీడీ సర్వే వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. బీపీ, షుగర్, హృద్రోగాలు, కిడ్నీ సమస్యల వంటి ఎన్‌సీడీల బారిన పడితే, ఆయా కుటుంబాలపై పడే ప్రభావాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలన్నారు. రోగులకు ప్రభుత్వాసుపత్రుల వైద్యంపై భరోసా కల్పించాలని, పేషెంట్లకు అవసరమైన మెడిసిన్‌ ఉచితంగా అందించాలన్నారు. ఇక మొబైల్ ద్వారా పేషెంట్లకు అవేర్నెస్ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, వారు రెగ్యులర్‌గా ట్రీట్‌మెంట్ తీసుకునేలా చూడాలని సూచించారు


Similar News