ఐఏఎస్‌లకు శాఖల కేటాయింపుపై సర్కార్ ఫోకస్.. ‘గులాబీ’ అధికారుల్లో టెన్షన్..!

వివిధ శాఖల్లో సెక్రటరీలు, కమిషనర్లు, డైరెక్టర్ల నియామకంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టబోతున్నది.

Update: 2023-12-11 01:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వివిధ శాఖల్లో సెక్రటరీలు, కమిషనర్లు, డైరెక్టర్ల నియామకంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టబోతున్నది. ఏ శాఖ బాధ్యతలు ఏ అధికారికి అప్పజెప్పాలన్నదానిపై సమాలోచనలు చేస్తున్నది. ఇంతకాలం బీఆర్ఎస్ నేతలకు సన్నిహితంగా వ్యవహరించిన ఆఫీసర్లపైనా ఆరా తీసే ప్రక్రియ సైతం మొదలైంది. వారి పనితీరుతో పాటు మానసికంగా అధికార పార్టీకి అంటకాగడం, మెప్పు కోసం అడ్డదార్లు తొక్కడం లాంటి పలు అంశాలపై అధ్యయనం జరుగుతున్నది. ప్రభుత్వ సర్వీసులో పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్న, రిటైర్ అయిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి వివరాలను రాబట్టే ప్రాసెస్ కూడా మొదలైంది. ‘గులాబీ కండువా కప్పుకోని అధికారులు.. పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు..’ అంటూ ఇంతకాలం విమర్శలు ఎదుర్కొన్న అధికారుల విషయంలో మాత్రం సీఎం సీరియస్‌గానే దృష్టి సారించినట్టు తెలిసింది. దీర్ఘకాలంగా ఒకే శాఖలో కంటిన్యూ అవుతున్న అధికారుల ప్రవర్తననూ పరిగణనలోకి తీసుకోవాలని రిటైర్డ్ అధికారుల టీమ్ భావిస్తున్నది. సీఎం ఆఫీస్ మొదలు వివిధ శాఖల కార్యదర్శులుగా ఉన్న అధికారుల పదేండ్ల వ్యవహారశైలి, పర్‌ఫార్మన్స్ తదితరాలపైనా సర్కారు దృష్టి పెట్టింది. రాష్ట్రస్థాయిలోనే కాకుండా ఢిల్లీలోనూ తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల బదిలీ వ్యవహారంపైనా కసరత్తు జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రయారిటీలకు అనుగుణంగా ఏ శాఖను ఎవరికిస్తే బాగుంటుందనే ముసాయిదా రెడీ అవుతున్నది.

ఈ నెలాఖరుకు బదిలీలు కంప్లీట్

సిక్స్ గ్యారెంటీస్‌కు తొలి ప్రాధాన్యత ఇస్తున్నందున వాటికి సంబంధించిన శాఖల కార్యదర్శులుగా సమర్ధులైనవారిని, కమిట్‌మెంట్‌తో పనిచేసేవారిని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకుని మూడు రోజులు దాటినా ఇప్పటివరకూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీపై ఫోకస్ పెట్టలేదు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డిని, సీఎంఓ కార్యదర్శిగా శేషాద్రిని మాత్రం లాంఛనంగా నియమించారు. మిగిలిన పోస్టుల జోలికి వెళ్లలేదు. రిటైర్డ్ అధికారులతో పాటు ఢిల్లీలోనూ జరుగుతున్న కసరత్తుకు అనుగుణంగా ప్రతిపాదితుల వివరాలు అందగానే బదిలీ ప్రక్రియను ప్రారంభించాలని సర్కారు భావిస్తున్నది. ఎలాగూ ఈ వారమంతా అసెంబ్లీ సెషన్‌ హడావుడి ఉన్నందున అది పూర్తికాగానే బదిలీల ప్రక్రియ మొదలుకానున్నట్టు సమాచారం. ఈ నెల చివరికల్లా మొత్తం ఐఏఎస్‌ల షఫ్లింగ్ ప్రాసెస్‌ను కంప్లీట్ చేసి కొత్త ఏడాది నుంచి పరిపాలనను పరుగులు పెట్టించాలన్నది ప్రభుత్వ ప్లాన్‌గా కనిపిస్తున్నది. ఒకదాని తర్వాత ఒకటిగా బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యే చాన్స్ ఉన్నది. ప్రధాన కార్యదర్శి మొదలు స్థాయిని బట్టి ఏయే అధికారికి బాధ్యతలు ఇప్పగిస్తారనేది స్పష్టమవుతుంది. ప్రభుత్వం మారగానే చాలా మంది ఐఏఎస్ అధికారుల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. తెలంగాణ స్థానికత కలిగిన అధికారులకు ప్రాధాన్యత వస్తుందని, బిహార్ అధికారులు లూప్‌లైన్‌లోకి వెళ్తారని, దీర్ఘకాలంగా ఒకే శాఖలో కంటిన్యూ అవుతున్నవారిని ఆ డిపార్టుమెంట్ల నుంచి తప్పించాలనే ఆలోచన ఉన్నట్టు ప్రాథమిక సమాచారం.

సెంట్రల్ డిప్యూటేషన్ కోసం కొందరి ప్రయత్నాలు

ప్రభుత్వం మారినా కొందరు అధికారులు ఇప్పటివరకూ కర్టసీ ప్రకారం సీఎంను లేదా సంబంధిత మంత్రులను కలవలేదనే ఆరోపణలు వచ్చాయి. పురపాలక శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ (ఐటీ, కమ్యూనికేషన్స్ కూడా) స్పెషల్ సీఎస్ జయేశ్‌రంజన్, సీఎంఓ సెక్రటరీ స్మితా సబర్వాల్ తదితరులు మర్యాదపూర్వకంగా కూడా సీఎంతో, సంబంధిత శాఖల మంత్రులతో భేటీ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం వీరు బీఆర్ఎస్ మంత్రులకు సన్నిహితంగా మెలిగారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంను కలవకపోవడం వెనక స్పష్టమైన ఉద్దేశం ఉన్నదనే మాటలు సెక్రటేరియట్‌లో వినిపిస్తున్నాయి. వీరు కేంద్ర ప్రభుత్వ సర్వీసులోకి డిప్యూటేషన్ మీద వెళ్లాలనుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే కొందరు ఆ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఓ అధికారి రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఈ ప్రయత్నాల్లో బిజీ అయ్యారని టాక్. కేంద్రంలోని రెండు మంత్రిత్వశాఖల్లోకి వెళ్లడానికి తనకు పరిచయమున్న అధికారుల ద్వారా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికీ ఆ వివరాలు అందాయి. వారిని సెంట్రల్ డిప్యూటేషన్ కోసం అనుమతించడమా?.. లేదా? అనేది త్వరలో వెల్లడి కానున్నది. పలు శాఖల్లో వివాదాలు, నిబంధనల ఉల్లంఘన, ఆరోపణలు ఉండడంతో వాటిపై ఇన్వెస్టిగేషన్ చేసేందుకు వారిని అవే శాఖల్లో కొనసాగించడమా?.. లేక రాష్ట్రం నుంచి వెళ్లిపోకుండా అప్రాధాన్యత డిపార్టుమెంట్లకు పంపడమా? అనే చర్చు జరుగుతున్నట్టు ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.

‘గులాబీ’ అధికారుల్లో టెన్షన్

ప్రభుత్వం మారినప్పుడు బదిలీలు సహజమే అయినా ప్రభుత్వం ఎక్కడికి పంపుతుందనే చర్చ ఆఫీసర్లలో మొదలైంది. ఇప్పుడున్న స్థానాల్లోనే కంటిన్యూ కావాలనే ప్రయత్నాలు కొందరివైతే.. మంచి శాఖకు వెళ్లాలని మరికొందరు వారి వంతు పైరవీలు చేసుకుంటున్నారు. ఇంకొందరు అధికారులు మాత్రం ఏ శాఖ ఇచ్చినా పనిచేయడానికి సిద్ధమేననే అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పటి వరకూ ప్రాధాన్యత కలిగిన శాఖలు నిర్వహించి బీఆర్ఎస్ నేతలతో క్లోజ్‌గా మెలిగారనే అపవాదును ఎదుర్కొంటున్న ఆఫీసర్లు మాత్రం లూప్‌లైన్‌లోకి వెళ్తామేమో అనే గుబులుతో ఉన్నట్టు సెక్రటేరియట్‌లో చర్చలు వినిపిస్తున్నాయి. బదిలీ ప్రాసెస్ ఎప్పుడు మొదలువుతుంది? ఉత్తర్వులు ఎప్పుడొస్తాయి? అనే ఆందోళన వారిని వెంటాడుతున్నది. ఈ నెల చివరికల్లా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని కొలిక్కి తేవాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. అసెంబ్లీ సెషన్ ఈ నెల 16 లేదా 17న పూర్తికాగానే ఇక వీటిపైనే ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నట్టు సమాచారం. రెండు వారాల్లోనే అంతా పూర్తయ్యి ఆర్డర్లు వస్తాయనేది సచివాలయ వర్గాల సమాచారం.

Tags:    

Similar News