రాజ్ భవన్‌కు వెళ్లిన ఆ ఎనిమిది ఫైళ్లు ఏమయ్యాయి?

రాజ్ భవన్.. ప్రగతిభవన్ మధ్య ఏర్పడిన గ్యాప్ పాలనపై ప్రభావం చూపుతున్నది. కీలకమైన 8 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపి గవర్నర్ కు పంపింది.

Update: 2022-10-26 03:50 GMT

 రాజ్ భవన్.. ప్రగతిభవన్ మధ్య ఏర్పడిన గ్యాప్ పాలనపై ప్రభావం చూపుతున్నది. కీలకమైన 8 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపి గవర్నర్ కు పంపింది. అలా రాజ్ భవన్ వెళ్లిన ఫైళ్లు తిరిగి రాలేదు. ఒక్క జీఎస్టీ సవరణ బిల్లుపై మాత్రం గవర్నర్ రాజముద్ర పడింది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ఆమోదిస్తేనే బిల్లుగా మారుతుంది. లేదా తిరస్కరిస్తే.. రెండో సారి గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపుతుంది. అప్పుడు తప్పక సంతకం చేయాల్సి ఉంటుంది. హుజూరాబాద్​ బై ఎలక్షన్ సమయంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి ని నియమిస్తూ కేబినెట్ చేసిన తీర్మానానిన గవర్నర్ తమిళిసై తిరస్కరించడంతో ఏర్పడిన గ్యాప్ రోజురోజుకూ పెరిగిపోతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రగతిభవన్, రాజ్ భవన్ మధ్య పంతాలు, పట్టింపుల కారణంగా కీలక బిల్లులు పెండింగ్ లో పడ్డాయి. ఎలాగూ గవర్నర్ సంతకం చేస్తారులే..! అనే మొండి వైఖరితో ప్రగతిభవన్ ఉంది. ఆమోదం కోసం సీఎం, మంత్రులు వస్తారని రాజ్ భవన్ ఎదురుచూస్తున్నది. దీంతో ఎవరు తగ్గుతారు..? ఎవరు నెగ్గుతారు..? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. భేషజాలు పక్కన పెట్టి స్వయంగా సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్తారా? లేదా? పెండింగ్ లో ఉన్న బిల్లులను గవర్నరే తిరస్కరిస్తారా? ఆ రెండింటిలో ఏదీ జరగకపోతే రెండోసారి బిల్లులను గవర్నర్ వద్దకు పంపేందుకు అసెంబ్లీని మరోసారి సమావేశ పరుచుతారా? అనే చర్చ జరుగుతున్నది. రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య ఏర్పాడ్డ గ్యాప్ ను ఎవరూ తగ్గిస్తారు? అందుకు ఎవరూ చొరవ చూపుతారు..? అనేది తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో అటు కొత్త చట్టం అమల్లోకి రాక, ఇటు పాత చట్టం ప్రకారం నిర్ణయాలు తీసుకోలేక ఉన్నతాధికారులు తలలు పట్టకుంటున్నారు.

జీఎస్టీ బిల్లు తప్ప అన్ని పెండింగ్ లోనే..

సెప్టెంబరు రెండోవారంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం 8 బిల్లులను అమోదించి అనుమతి కోసం గవర్నర్ కు పంపింది. అందులో జీఎస్టీ సవరణ బిల్లు మినహా మిగతా ప్రైవేటు యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు, ఫారెస్ట్రీ వర్సిటీ, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అధికారాల సవరణ, మున్సిపల్ సవరణ, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ, మోటర్ వెహికల్ చట్ట సవరణ బిల్లులను గవర్నర్ ఇంతవరకు అమోదించలేదు. వీటిపై ఉన్న అభ్యంతరాలనూ గవర్నర్ ప్రశ్నించలేదు. పెండింగ్ లో ఉన్న బిల్లులను అమోదించాలని ప్రభుత్వం నుంచి గవర్నర్ కు ఎలాంటి వినతులు అందలేదని రాజ్ భవన్ వర్గాలు అంటున్నాయి.

పెండింగ్ లో ఖైదీల విడుదల ఫైల్

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఆగస్టు 15న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తారని అందరూ భావించారు. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాకపోవడంతో జైళ్లశాఖ ఖైదీలను విడుదల చేయలేదు. 75 మంది ఖైదీలను గుర్తించి, వారిని విడుదల చేయాలని కేబినెట్ తీర్మానించింది. ఆమోదం కోసం పంపిన ఫైల్ ను గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం గమనార్హం.

పెండింగ్ కు నో టైమ్ లిమిట్

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ సంతకం చేస్తేనే అవి చట్టంగా మారుతాయి. అప్పటి వరకు వాటి అమలు కుదరదు. అసెంబ్లీ అమోదించిన బిల్లులపై గవర్నర్ ఇన్ని రోజల్లోపు గవర్నర్ సంతకం చేయాలని చెప్పే నిబంధనలు రాజ్యాంగంలో లేవు. ఒకసారి గవర్నర్ తిరస్కరించిన బిల్లును యాథావిధిగా ప్రభుత్వం రెండోసారి ఆమోదం కోసం పంపితే తప్పనిసరిగా సంతకం చేయాలి. గవర్నర్ ఆమోదం, తిరస్కరణతో సంబంధం లేకుండా అసెంబ్లీ ఆమోదించిన ఆర్థిక బిల్లులను యథావిధిగా అమలు చేసే వెసులు బాటు ప్రభుత్వానికి ఉంటుంది. మిగతా బిల్లుల విషయంలో ఆమోదమో.. తిరస్కరణో కచ్చితంగా జరగాల్సి ఉంటుంది.

హుజూరాబాద్ బై ఎలక్షన్ నుంచి గ్యాప్

కాని గవర్నర్‌గా తమిళిసై బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజులపాటు అంతా సజావుగానే సాగింది. హుజూరాబాద్ బై ఎలక్షన్ నుంచి ప్రగతిభవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ కు బీజం పడింది. గవర్నర్ కోటాలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డిని నియమిస్తూ కేబినెట్ చేసిన తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టారు. సంతకం కోసం కొంత కాలం ఎదురుచూసిన ప్రయోజనం లేకపోవడంతో గవర్నర్ కోటాలో కొత్తగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని నియమిస్తూ కేబినెట్ రెండోసారి ఫైల్ పంపగా గవర్నర్ రాజముద్ర వేశారు. అప్పటి నుంచి గ్యాప్ కొనసాగుతూనే ఉన్నది. గవర్నర్ తల్లి చనిపోయినప్పుడు ఆమెను పరామర్శించడానికి సీఎం వెళ్లలేదు. తల్లి మృత దేహాన్ని చెన్నైకి తీసుకెళ్లేందుకు విమానం కూడా ఇవ్వలేదు. తమిళిసై జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆఫీసర్లు కనీసం ప్రొటోకాల్ పాటించలేదు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి సీఎం, మంత్రులు వెళ్లలేదు. తనను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారంటూ తమిళిసై పలుమార్లు మీడియా ముందు వాపోయారు. ఈ గ్యాప్ ఎప్పటి వరకు కొనసాగుతుంది.. బిల్లులకు ఆమోదం లభిస్తుందా..? ఏం జరుగనుందనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే!

ఇవి కూడా చ‌ద‌వండి

1.బీజేపీకి బిగ్ షాక్.. గులాబి గూటికి మరో కీలక నేత

2.బ్రేకింగ్ న్యూస్.. కరేన్సీ నోట్లపై వినాయక, లక్ష్మీదేవి ఫొటోలు పెట్లాలన్ని సీఎం

Tags:    

Similar News