టీ సర్కార్‌కు చుక్కలు చూపించిన గవర్నర్ పవర్!

గవర్నర్ పదవి నామమాత్రమే కావొచ్చు. కానీ కొన్ని సార్లు ఆ పోస్టు చాలా కీలకంగా మారుతుంది.

Update: 2023-01-31 03:20 GMT

గవర్నర్ పదవి నామమాత్రమే కావొచ్చు. కానీ కొన్ని సార్లు ఆ పోస్టు చాలా కీలకంగా మారుతుంది. గవర్నర్ ఆమోదం లేకుండా ప్రభుత్వం నయా పైసా ఖర్చు చేయలేదు. ఎంత గొప్ప చట్టం చేసినా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ముందుకెళ్లలేని పరిస్థితి. తెలంగాణ గవర్నర్ తమిళి సై వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన పలు ఇన్సిడెంట్స్‌తో ఇది స్పష్టమైందని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరువురి మధ్య సమన్వయం ఉండాలని, ఒకరిపై మరొకరు పెత్తనం చేసే ప్రయత్నాలు చేస్తే రాజ్యాంగ సంక్షోభాలు తలెత్తుతాయని సూచిస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టికల్ 202 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా తయారు చేసే బడ్జెట్‌కు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం తప్పనిసరి. గవర్నర్ సంతకం చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన పద్దులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలి. ఎన్ని రోజుల్లోపు అనుమతి ఇవ్వాలో మాత్రం రాజ్యాంగంలో క్లారిటీగా లేదు. అయితే అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌ను మాత్రం యథావిధిగా గవర్నర్ ఆమోదం తెలపాలి. కొత్త బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు, ప్రస్తుత బడ్జెట్‌లో మార్పులు, చేర్పులు జరిగితే వాటిపైనా గవర్నర్ నుంచి తప్పనిసరిగా సంతకం తీసుకోవాల్సి ఉంటుంది.

గవర్నర్ పరిధిలో మాత్రమే జాయింట్ సెషన్

రాజ్యాంగం ప్రకారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించాలంటే, ఆ సభలను సమావేశ పరిచే అధికారం గవర్నర్‌కు మాత్రమే ఉంటుంది. అయితే ప్రభుత్వం సూచించే తేదీల్లో మాత్రమే గవర్నర్ జాయింట్ సెషన్ నిర్వహణ కోసం గెజిట్ విడుదల చేస్తుంది. అలాగే సభను ప్రొరోగ్ చేసే అధికారం కూడా గవర్నర్ పరిధిలోనే ఉంది. ఒకవేళ ప్రొరోగ్ చేయకుండా అలాగే కొనసాగిస్తే అత్యవసరమైన అంశాలపై అర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ప్రభుత్వానికి ఉండదు. గవర్నర్ తమిళి సై తో ఏర్పడిన వివాదం నేపథ్యంలో కొన్ని విషయాల్లో ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చే అవసరం ఏర్పడినా ప్రభుత్వం మాత్రం చట్టాలు చేసేందుకే మొగ్గు చూపిందనే చర్చ జరిగింది.

సంతకం చేస్తేనే బిల్లులు

అసెంబ్లీలో చేసిన ప్రతి బిల్లుపైనా గవర్నర్ సంతకం తర్వాతే అవి యాక్టుగా మారుతాయి. లేకపోతే అవి అమల్లోకి రావు. అయితే అసెంబ్లీ పంపిన బిల్లులను ఎన్ని రోజుల్లోపు గవర్నర్ ఆమోదించాలో రాజ్యాంగంలో లేదు. కానీ ఒకసారి వెనక్కి పంపిన బిల్లులను తిరిగి గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపితే తప్పనిసరిగా ఆమోదించాలి. గతేడాది సెప్టెంబర్‌లో అసెంబ్లీ ఆమోదించిన ఏడు బిల్లులను పరిశీలించిన తర్వాతే సంతకం చేస్తానని, వాటిని గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. దానిపై మంత్రులు, గవర్నర్ మధ్య కొన్ని నెలలుగా పరస్పరం విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించే వ్యక్తుల పూర్వాపరాలు తెలుసుకుని ఆమోదం తెలపాలి. ఒకవేళ ఆ వ్యక్తులు కేబినెట్ సిపార్సులకు భిన్నంగా ఉన్నట్టు భావించి పెండింగ్‌లో పెట్టొచ్చు. కౌశిక్ రెడ్డి విషయంలో గవర్నర్ ఇదే తీరుగా వ్యవహరించారు.

అసెంబ్లీ రద్దు.. కొత్త అసెంబ్లీ ఏర్పాటులో కీలకం

గడువులోపు అసెంబ్లీని రద్దు చేయడం, కొత్తగా ఎన్నికైన అసెంబ్లీని సమావేశ పరిచే అధికారం గవర్నర్‌కే ఉంటుంది. కేబినెట్ సభను రద్దు చేస్తూ తీర్మానం చేస్తే, దానిపై గవర్నర్ సంతకం చేస్తేనే అసెంబ్లీ రద్దు అవుతుంది. లేకపోతే ఆ సభ అలాగే కొనసాగుతుంది. కొత్తగా ఎన్నికైన సభను సమావేశ పరిచే అధికారం కూడా గవర్నర్‌కే ఉంది.

న్యాయనిపుణుల హెచ్చరికతో అలర్ట్

గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం కష్టమని న్యాయ నిపుణుల హెచ్చరికలతో సీఎం కేసీఆర్ మనసు మార్చుకున్నట్టు తెలిసింది. సభ ప్రొరోగ్ చేయని కారణంగా గవర్నర్ స్పీచ్ అవసరం లేదని ప్రభుత్వం ఇంతకాలం వాదించింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు వివరించాలని ప్రభుత్వం భావించింది. ఈ విషయంలో హైకోర్టులో ప్రతికూలంగా తీర్పు వస్తే. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. కానీ ప్రతి బడ్జెట్ సెషన్ గవర్నర్ స్పీచ్‌తో మాత్రమే ప్రారంభమయ్యే సంప్రదాయం కొనసాగుతుందని, రాజ్యంగ ధర్మాసనంలో కూడా చుక్కెదురు తప్పదని సీఎం కేసీఆర్‌ను లీగల్ ఎక్స్‌పర్ట్స్ అలర్ట్ చేశారని సమాచారం. దీంతో గవర్నర్ స్పీచ్‌కు ఆయన మొగ్గు చూపినట్టు ప్రచారం జరుగుతుంది.

సరైన ఆన్సర్ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం

గతేడాది బడ్జెట్ సమావేశాల టైమ్‌లోనే తనను తప్పుదోవ పట్టించారని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ''ముందుగా గవర్నర్ స్పీచ్ ఉంటుందని చెప్పి బడ్జెట్ తయారీ కోసం అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత గవర్నర్ స్పీచ్ ఏమైందని అడిగితే పొరపాటు జరిగిందని సర్కారు చెప్పింది. అయితే బడ్జెట్ పద్దులను కొంతకాలం ఆపే అధికారం ఉన్నా.. ప్రజా సంక్షమేం దృష్ట్యా మాత్రమే బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు అనుమతి ఇచ్చాను.'' అని గత ఏడాది స్పష్టం చేశారు. ఈసారి కూడా గవర్నర్ స్పీచ్ లేకుండానే బడ్జెట్ సెషన్స్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఆర్థిక శాఖ గవర్నర్‌ను అనుమతి కోరింది. దీనిపై స్పందిస్తూ.. ప్రసంగం ఉంటుందా? అని రాజ్ భవన్ వర్గాలు ప్రభుత్వానికి లేఖ రాశాయి. దీనిపై ఏం సమాధానం ఇవ్వాలో తెలియక ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది.

చెక్ అండ్ బ్యాలెన్స్

గవర్నర్, ప్రభుత్వం మధ్య అధికారాలు, బాధ్యతలను రాజ్యాంగం స్పష్టంగా విభజించింది. పరిధి ఏ మేరకు ఉందో కూడా క్లారిటిగా చెప్పింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి మాత్రమే నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. అయితే గవర్నర్ సొంతంగా విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే చాన్స్ లేదు. కేబినెట్ సిఫార్సులను తప్పకుండా ఆమోదం తెలపాలి. అయితే రాష్ట్ర అసెంబ్లీ చేసిన చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నట్టు భావిస్తే..వాటిని రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి. అలాగే ఒకసారి తిరస్కరించిన బిల్లును, నిర్ణయాన్ని మళ్లీ ప్రభుత్వం పంపితే తప్పనిసరిగా గవర్నర్ సంతకం చేయాలి. అలాగే కేబినెట్ ఆమోదం తెలిపిన ప్రసంగాన్ని మాత్రమే గవర్నర్ అసెంబ్లీలో చదవాలి. సొంతంగా ఒక పదాన్ని యాడ్ చేసే పవర్ లేదు.

సమన్వయం తప్పనిసరి

ప్రభుత్వంలో గవర్నర్ అంతర్భాగం. గవర్నర్ పేరుతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. కానీ గవర్నర్, ప్రభుత్వం మధ్య సమన్వయం తప్పనిసరి. కాని పేచీలు రాకుండా ఇరువురు సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని రాజ్యంగ నిపుణులు చెబుతున్నారు. రాజకీయాలకతీతంగా గవర్నర్ వ్యవహరించాలి. అలాగే ప్రభుత్వ పెద్దగా గవర్నర్‌ను సర్కారు గౌరవించాలి. లేకపోతే రెండు ఆఫీసుల మధ్య ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుందని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.

Also Read...

గవర్నర్‌, సీఎం KCR మధ్య సఖ్యత కుదిరినట్టేనా..? 

Tags:    

Similar News