నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటులో మరో కీలక ముందడుగు..!

నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ‘తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీ’ పేరుతో

Update: 2024-07-19 17:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ‘తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీ’ పేరుతో ఉపాధి కల్పన కోసం కొత్త ఉన్నత విద్యా సంస్థను నెలకొల్పుతున్నది. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో సిటీలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలో మెయిన్ క్యాంపస్‌ను, హెడ్‌క్వార్టర్‌ను ఏర్పాటు చేయనున్నది. తొలి దశలో ఏటా రెండు వేల మంది విద్యార్థులకు ఆరు కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతో ప్రారంభించి క్రమంగా ప్రతీ సంవత్సరం 17 కోర్సుల్లో 20 వేల మందికి అడ్మిషన్లు కల్పించనున్నది. నాలుగేండ్ల డిగ్రీతో పాటు ఏడాది వ్యవధిలో డిప్లొమా, నాలుగైదు నెలల నిడివితో సర్టిఫికెట్ కోర్సులను నిర్వహించేలా ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ కార్యదర్శులు, అధికారులు, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొని చర్చించారు.

రాష్ట్రంలోని పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటికి అనుసంధానంగా విద్యార్థులకు వీటిల్లో ఉపాధి లభించేలా స్పెషల్ కోర్సుల్ని నిర్వహించాలన్నది ఈ యూనివర్శిటీ స్థాపన వెనక ఉన్న ఉద్దేశం. ఈ నెల 23న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు పెట్టి ఆమోదం పొందేలా ప్లాన్ చేస్తున్నది. బిల్లును సమగ్రంగా రూపొందించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. కోర్సుల రూపకల్పన, సిలబస్ తదితరాలపై ముసాయిదాను తయారుచేయాల్సిందిగా అధికారులకు సూచించారు. స్కిల్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు నిధుల కొరత లేదని నొక్కిచెప్పిన సీఎం.. రానున్న రోజుల్లో విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించి లైఫ్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడమే అంతిమ లక్ష్యమన్నారు. యూనివర్సిటీ ఏర్పాటుకు, ప్రతి ఏటా నిర్వహణకు ఖర్చు ఎంతైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని క్లారిటీ ఇచ్చారు.

ఢిల్లీ, హర్యానాల్లో ఇప్పటికే అధ్యయనం పూర్తి:

ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటికే పనిచేస్తున్న పలు స్కిల్ యూనివర్సిటీలను పరిశీలించిన రాష్ట్ర పరిశ్రమల విభాగం తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులు, పరిశ్రమలను గమనంలోకి తీసుకుని ముసాయిదాను రూపొందించింది. దీనిపై ఈ సమావేశంలో లోతుగా చర్చ జరిగింది. ఈ యూనివర్సిటీలో నిర్వహించాల్సిన కోర్సులు, వాటి కాల వ్యవధి, సమకూర్చాల్సిన మౌలిక వసతులు, నిర్వహణకు అవసరమయ్యే నిధులు, వివిధ కంపెనీలతో అందాల్సిన భాగస్వామ్యం తదితర అంశాలపై పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సరికొత్త వ్యవస్థకు ‘తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ’ అని పేరు పెట్టాలని ఈ సమావేశం నిర్ణయించింది. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో ఉనికిలోకి రానున్న ఈ యూనివర్శిటీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వయం ప్రతిపత్తి కలిగి ఉండేలా చేయాలని ప్రభుత్వం స్పష్టతకు వచ్చింది.

డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు:

కొత్తగా ఏర్పాటయ్యే యూనివర్శిటీలో మూడు నాలుగేండ్ల కాలవ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులను నిర్వహించాలనే ప్రాథమిక నిర్ణయం జరిగింది. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేసినట్లు అధికారులు వివరించారు. ఫార్మా, కన్‌స్ట్రక్షన్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్, రిటెయిల్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్, కామిక్స్ తదితర మొత్తం 17 ప్రాధాన్యత కలిగిన రంగాలను గుర్తించినట్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో అధికారులు పేర్కొన్నారు. తొలుత ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను ప్రవేశ పెట్టి ప్రతి కోర్సును సంబంధిత రంగంలో పేరొందిన ఒక కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేసేలా ప్రణాళిక రూపొందింది. ఇందుకోసం ఆయా కంపెనీలతో ప్రభుత్వం అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నది. తొలి ఏడాది రెండు వేల మందితో కోర్సుల్ని ప్రారంభించి, క్రమంగా ఏడాదికి 20 వేల మందికి అడ్మిషన్లు ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది.

హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ (ఈఎస్సీ) క్యాంపస్‌తో పాటు జిల్లా కేంద్రాల్లోనూ ప్రాంతీయ ప్రాంగణాల (శాటిలైట్ క్యాంపస్)లను ఏర్పాటు చేయాలని ఈ సమావేవంలో చర్చ జరిగింది. కానీ జిల్లా కేంద్రాల్లో శాటిలైట్ క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తే వాటిలో చేరే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుందన్న అంచనాతో హైదరాబాద్ క్యాంపస్‌లో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారన్న ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ కారణంగా హైదరాబాద్ మెయిన్ క్యాంపస్‌లోనే అందరికీ శిక్షణను అందించేలా ఏర్పాట్లు చేయాలని, ఈఎస్సీతో పాటు ‘న్యాక్’ క్యాంపస్‌ను ఉపయోగించుకోవాలని, అవసరమైన మౌలిక వసతి సదుపాయాలుండే వివిధ ప్రాంగణాలను గుర్తించాలని సీం సూచించారు. భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రస్తుతం ఉన్న సదుపాయాలను అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలన్నారు.

డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని, రాష్ట్రంలో ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, అటువంటి కోర్సుల్లో ఎక్కువ సీట్లు ఉండాలని సీఎం ఈ సమావేశంలో సూచించారు. ఈ కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు ఉండాలని, ఇందుకు సంబంధించి ముందుగానే వివిధ కంపెనీలతో చర్చించాలని అధికారులను అప్రమత్తం చేశారు. మిగతా యూనివర్సిటీలు అనుసరించిన విధానాలను పరిశీలించి కొత్త యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణాన్ని తయారు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పలు మార్పులు చేర్పులు చేసి ముసాయిదాను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.


Similar News