ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు.. కన్నీళ్లు పెట్టుకుంటున్న డాక్టర్లు

దిశ, తెలంగాణ బ్యూరో: సర్కార్​ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో కొందరు డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Update: 2022-03-06 14:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సర్కార్​ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో కొందరు డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పీహెచ్‌సీల నుంచి సుమారు 291 మంది డాక్టర్లను టీచింగ్, జిల్లా, ఏరియా ఆసుపత్రులకు బదిలీలు చేసిన విషయం తెలిసిందే. అయితే వీరందరి సర్వీస్ లాస్ చేస్తూ సర్కార్​ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని డాక్టర్లు తప్పుబడుతున్నారు. ఏళ్ల తరబడి పీహెచ్‌సీల్లో సేవలందించిన తమకు సర్వీస్​ తొలగించడం అన్యాయమంటూ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసిన తమను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వలన ఇప్పటి వరకు సీనియర్లుగా ఉన్న తాము కొత్త పోస్టింగ్‌లలో చేరిన తర్వాత జూనియర్లుగా మారిపోతున్నట్లు వివరించారు. దీని వలన ప్రమోషన్లు, పోస్టింగ్‌లలో చిక్కులు వచ్చే ప్రమాదం ఉన్నదని డాక్టర్లు నొక్కి చెబుతున్నారు. అంతేగాక, కొత్తగా వచ్చిన డాక్టర్ల కింద పనిచేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని, దీని వలన వైద్యసేవల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని స్పష్టం చేస్తున్నారు. స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వకుండా ప్రభుత్వం తమ జీవితాలతో ఎందుకు ఆడుకుంటుందో? అర్థం కావడం లేదని హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్​ 'దిశ'కు చెప్పారు. 15, 20 ఏళ్ల నుంచి పీహెచ్‌సీల్లో పనిచేసినోళ్ల సర్వీస్‌ను కూడా కలపకపోవడం విచిత్రంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డాక్టర్లంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బలవంతంగా రిలీవ్..

మెడికల్‌లో​ పీజీలు పూర్తి చేసి పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న డాక్టర్లు తప్పనిసరిగా పెద్ద దవాఖాన్లలో పనిచేయాల్సిందే అని సర్కార్ నొక్కి చెప్పింది. దీనికి పీజీ డాక్టర్లు కూడా సుముఖంగానే ఉన్నారు. అయితే టీవీవీపీ, డీఎంఈ పరిధిలోని ఆసుపత్రుల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఏ స్పెషాలిటీ డాక్టర్ ఎక్కడ అవసరం? వంటి ప్లాన్​లేకుండానే సడన్‌గా 291 మంది డాక్టర్లను ప్రభుత్వం పీహెచ్​ సీల నుంచి రిలీవ్​ చేసేసింది.కేవలం వారం రోజుల్లో రిలీవ్​కావాలని ఫిబ్రవరి 7వ తేదీన ఉత్తర్వులు జారీ చేస్తూ 13 తేదీ వరకు గడువు ఇచ్చింది. ప్రభుత్వం ఉత్తర్వులు రావడంతో చేసేదేమీ లేక డాక్టర్లు పోస్టింగ్ అంశాలను పక్కన పడేసీ రిలీవ్ అయిపోయి టీవీవీపీ, డీఎంఈ ఆసుపత్రుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 24 తేదిన కౌన్సిలింగ్‌లకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత కానీ డాక్టర్లకు అసలు విషయం అర్థం కాలేదు. మరో వైపు 25వ తేదీతో ఆర్డర్​కాఫీ ఇస్తూ మార్చి 2వ తేదీన వెబ్‌సైట్‌లో ఆర్డర్లు పొందుపరిచారు. దీంతో ఆ నెల జీతమంతా కోల్పోవాల్సి వస్తుందని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే అకస్మికంగా రిలీవ్ చేసి తమకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదని పలువురు డాక్టర్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

తెలివిగా వ్యవహరిస్తూ..

డాక్టర్లు సర్దుబాట్ల విషయంలో లీగల్ సమస్యలు రాకుండా సర్కార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నది. వైద్యశాఖలో 35 ఏ రూల్ ప్రకారం ప్రభుత్వమే అడ్మినిస్ట్రేటివ్​తదితర పోస్టులకు పంపిస్తే తప్పనిసరిగా సర్వీస్, సినియారిటీ, పే స్కేలు వంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, పీహెచ్‌సీల నుంచి రిలీవ్​చేసిన డాక్టర్లకు బలవంతంగా 35 బీ ఫామ్‌లపై సంతకాలు తీసుకున్నది. అంటే ఇష్టపూర్వకంగానే పీహెచ్‌సీల నుంచి రిలీవ్ అయినట్లు అర్థం. అయితే రిలీవ్ చేసే సమయంలో సదరు డాక్టర్లకు సర్కార్ ఇవన్నీ తెలియపర్చలేదు. దీంతో డాక్టర్లంతా డైలమాలో ఉన్నారు. ప్రభుత్వం ఇలా బలవంతంగా మోసం చేస్తుందని ఊహించలేదని డాక్టర్లు మండిపడుతున్నారు.

తిప్పుతున్నారు..

సర్వీస్ లాస్, సీనియారిటీ సమస్యలను ఎదుర్కొంటున్నామని సదరు డాక్టర్లు పబ్లిక్ హెల్త్​ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్తే ప్రభుత్వం సూచనల మేరకు తాము రిలీవ్ చేసేశామని, ఇప్పుడు తమకు ఎలాంటి సబంధం లేదని అక్కడి ఆఫీసర్లు తేల్చేశారు. తిరిగి వద్దమంటే ఎట్టి పరిస్థితుల్లో పీహెచ్‌సీల్లో మళ్లీ చేర్చుకోమని చెప్పేస్తున్నారు. డీఎంఈ కార్యాలయానికి వెళ్తే మిమ్మల్ని రిలీవ్ చేసింది పబ్లిక్​హెల్త్​ఆఫీసర్లే, అక్కడే సమస్యను పరిష్కరించుకోవాలని డీఎంఈ సూచిస్తున్నట్లు కొందరు డాక్టర్లు వాపోతున్నారు. మినిస్టర్​ దగ్గరకు పోతే పీజీలు చేసినోళ్లంతా పెద్ద ఆసుపత్రుల్లో పనిచేయాల్సిందేనని నొక్కి చెప్పారు. అంతా బాగానే ఉన్నా సర్వీస్ లాస్​ విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడం లేదు. ఇలా చాలా మంది డాక్టర్లు కన్ఫ్యూజన్‌లో కొట్టుమిట్టాడుతున్నారు.

నో ఆప్షన్‌కు చుక్కలు..

సర్దుబాటు ప్రక్రియలో చేసిన కౌన్సిలింగ్‌లో స్థానికత ఆధారంగా పోస్టింగ్‌లు తీసుకుందామని కొందరు నో ఆప్షన్లు పెట్టారు. సుమారు 25 నుంచి 30 డాక్టర్లు ఇలా నమోదు చేశారు. దీంతో ఇప్పటికీ వారికి కొత్త పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఇటు డీహెచ్​సైడ్, అటు డీఎంఈ పరిధిలోకి కాకుండా మధ్యలోనే ఇరుకున పడ్డారు. ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారుల కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు.

Tags:    

Similar News