‘పాలన గాలికి.. ఓన్లీ పాలిటిక్స్‌పైనే ఫోకస్’
కేసీఆర్ పాలనను గాలికి వదిలి.. ఫోకస్ అంతా పాలిటిక్స్ పై పెట్టారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ పాలనను గాలికి వదిలి.. ఫోకస్ అంతా పాలిటిక్స్‌పై పెట్టారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ వైఖరితో జనాలకు తిప్పలు తప్పడం లేదన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు భరోసా లేదన్నారు. గత కొన్ని రోజులుగా వడగళ్ల వర్షాలతో పంటలు, పండ్ల తోటలు భారీగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం తక్షణ చర్యలేవీ తీసుకోలేదన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వడగళ్ల వర్షాలు పడ్డ ప్రాంతాలను పర్యటించి నష్టం వివరాలు, గ్రామాలలో పంటల కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తారన్నారు.
రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ మినిమం గవర్నెన్స్, మాక్సిమం పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. రైతుల పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నాయన్నారు. వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు కోదండరెడ్డి మాట్లాడుతూ.. గత 50 ఏళ్లలో రాష్ట్రంలో ఎన్నడూ ఇలాంటి విపత్కర పరిస్థితి లేదన్నారు.
దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. పైగా ప్రభుత్వం భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. ఇక కేసీఆర్.. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్‌కు ఒక్కసారి కూడా పోలేదన్నారు. గతంలో కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ప్రకృతి వైపరీత్యాలను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రూ.1600 కోట్లు ఇచ్చిందని, కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయిని కూడా అందించలేదన్నారు. వెంటనే నష్టపోయిన పంటకు సాయం చేయాలన్నారు.