పంచాయతీ ఎన్నికలపై సర్కార్ ఫోకస్.. 33 జిల్లాల కలెక్టర్లకు CS కీలక ఆదేశం..!

తెలంగాణలో గ్రామ పంచాయతీల పదవి కాలం ముగిసి దాదాపుగా ఆరు నెలలు కావడంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఫోకస్ పెట్టింది.

Update: 2024-07-29 12:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గ్రామ పంచాయతీల పదవి కాలం ముగిసి దాదాపుగా ఆరు నెలలు కావడంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఫోకస్ పెట్టింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. వీలైనంత తొందరగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కసరత్తును ప్రభుత్వ యంత్రాగం స్పీడప్ చేసింది. ఈ క్రమంలోనే వచ్చే నెల (ఆగస్ట్) 2, 3 తేదీల్లో ప్రతి జిల్లా నుండి ఐదుగురికి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇప్పించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 33 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఈ ఏడాది జనవరిలో గ్రామ పంచాయతీల పదవి కాలం ముగిసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ లేకపోవడంతో ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. దీంతో వీలైనంత తొందరగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే, పాత బీసీ రిజరేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా లేక.. రాష్ట్రంలోని బీసీ ఓటర్లను లెక్కించి బీసీ కమిషన్ ఇచ్చిన నివేదికగా ఆధారంగా ఎన్నికలు కండక్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. 


Similar News